ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు ఢిల్లి వెళ్లనున్నారు. ఢిల్లిలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ (ఇ.సి) అధికారులతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. నేడిక్కడ విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎలక్షన్ పని తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎలక్షన్ కమిషన్ చేతగానితనానికి ప్రజలు శిక్ష అనుభవించాలా అని ఆయన ప్రశ్నించారు. తాను రేపు ఢిల్లికి వెళుతున్నానని దీనిపై ఇసిని అడుగుతానని ఆయన చెప్పారు. పని చేయని ఇవిఎంలపై ఇ.సి సమాధానం చెప్పాల్సిందేనని ఆయన అన్నారు. ఈవిఎంల రిపేరు చేస్తామని వచ్చే వారు రిపేరు చేస్తున్నారా? లేక వాటిని ట్యాంపర్ చేస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఇదే సమయంలో వీవీప్యాట్‌ల లెక్కింపుపై సుప్రీం తీర్పు వ్యవహారంలో రివ్యూ పిటిషన్ వేస్తానని చంద్రబాబు తెలిపారు.
ఈవీఎంల మొరాయింపు సమయంలో వాటిని సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరు? వారికి ఉన్న అర్హతలేంటో చెప్పాలని ఈసీని డిమాండ్ చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. వారిని ఎలా నియమించారని ప్రశ్నించనున్నట్లు పేర్కొన్నారు. వీవీప్యాట్‌ల మొత్తం లెక్కింపునకు ఆరు రోజులు పట్టడమేంటని సీఎం ప్రశ్నించారు. వీవీప్యాట్‌లోని స్లిప్‌లు లెక్కించడానికి ఆరు గంటలు మించదని వెల్లడించారు. గతంలో బ్యాలెట్ పత్రాలు లెక్కించే పద్ధతిలో ఎంత సమయం పట్టిందో గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో తాను ఛాలెంజ్ చేస్తున్నానని, నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. దీనిపై దేశ స్థాయిలో పోరాడేందుకు సిద్ధమని వెల్లడించారు.
అవసరమైతే ధర్నాలు, ఆందోళనలు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే పదవి అంగటి సరకులా తయారైందని, ప్రజాప్రతినిధుల భవిష్యత్ యంత్రాలపై ఆధారపడి ఉండడమేంటని సీఎం విమర్శించారు. ఏకధాటిగా రెండు గంటలపాటు యంత్రం పని చేయకపోతే రీపోలింగ్‌కు అవకాశముందని వివరించారు. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసాలు సృష్టించారని, ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తున్నారని ప్రతిపక్షాల పై చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ను మరొక బీహార్ చేయాలని ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. అన్ని చోట్ల టిడిపి అభ్యర్థులపై దాడులు చేశారని ఆయన అన్నారు. సాంకేతిక లోపాల పేరుతో ఓటర్లతో ఆడుకున్నారని, ప్రజాస్వామ్యం భవిష్యత్ ఒక యంత్రంపై ఆధారపడుతుందా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సిఇఒ) ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. సిఇఒకె ఇబ్బంది ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.