ఎన్నికలకు సరైన భద్రత కల్పించలేకపోవడం వల్లే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అంగీకరించారు. తగినంత భద్రతా బలగాలు కావాలని తాను, కలెక్టర్లు, ఎస్పీలు కోరినా ఎన్నికల సంఘం స్పందించలేదని ఆయన తేల్చారు. అందువల్లే హింసాత్మక సంఘటనలు, హత్యలు జరిగి పోలింగ్‌ను ప్రభావితం చేశాయని గురువారం మీడియాతో మాట్లాడుతూ ద్వివేది స్పష్టం చేశారు. ‘తాడిపత్రి, పూతలపట్టు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనల ప్రభావం పోలింగ్‌పై పడింది. తాడిపత్రిలో టీడీపీ సానుభూతిపరుడి హత్య జరిగిన తర్వాత అక్కడ పోలింగ్ మందగించింది. చిత్తూరులోని ఒక కేంద్రంలో మధ్యాహ్నం 3గంటలకే పోలింగ్ ఆపాల్సి వచ్చింది. రాష్ట్రంలో మొత్తంగా 25 చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.
అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఒకరు, చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లెలో మరొకరు చనిపోయారు. రెండువర్గాల మధ్య కొట్లాటలు, రాళ్లు రువ్వుకోవడాలు, భౌతిక దాడులు జరిగాయి. ఘర్షణలు జరిగిన పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంల మొరాయింపువల్ల పోలింగ్ ఆసల్యమైన చోట రీపోలింగ్ నిర్వహించే ప్రతిపాదనను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం’ అని చెప్పారు. ‘సిబ్బందికి అనేకసార్లు శిక్షణనిచ్చినప్పటికీ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంపై చర్యలు తీసుకుంటాం. ఐదేళ్లకొకసారి వేసే ఓటును ఓటరు సద్వినియోగం చేసుకోవడానికి తలెత్తిన అడ్డంకుల్లో సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉంది. మొత్తం 381చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. 6 చోట్ల మాక్‌పోల్ ఓట్లను తొలగించకుండానే ఓటింగ్ కొనసాగించారు.
7చోట్ల ఈవీఎంల విధ్వంసం జరిగింది. మాక్‌పోలింగ్ సమయంలోనే కొన్ని ఈవీఎంలను మార్చాం. మరికొన్ని ఈవీఎంలను పోలింగ్ జరుగుతుండగా మార్చాల్సి వచ్చింది. నిర్ణీత సమయంలో ఈవీఎంలు మరమ్మతు చేయకపోవడం వల్ల కూడా ఉదయం పూట ఓటర్లకు సమయం వృథా అయింది. చాలాచోట్ల ఓటర్లు గంటలకొద్ది క్యూలో నిలబడాల్సి వచ్చింది. రీపోలింగ్‌కు, సర్దుబాటు పోలింగ్ (అడ్‌జర్న్‌డ్ పోలింగ్)కు వివిధ పార్టీల నుంచి వచ్చిన వినతులను, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లకు పంపాము. పాక్షికంగా పోలింగ్ జరిగిన చోట సర్దుబాటు పోలింగ్ నిర్వహిస్తాం. చిలకలూరిపేటలో రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలపై కలెక్టర్‌ను వివరణ అడిగాం. పూతలపట్టులో రీపోలింగ్‌కి అవకాశం ఉంది. మావోయిస్టు ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరగడం సంతృప్తిగా ఉంది.’’ అని ద్వివేది చెప్పారు.