పోలింగ్ ప్రక్రియ ముగియడంతో తెలుగుదేశం నేతలు పార్టీ గెలుచుకునే స్థానాల పై అంచనాలు వేసుకుంటున్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చంద్రబాబు ఇమేజ్‌తో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహిళా ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలిరావడంతో టీడీపీకి సానుకూల ఓటింగ్ గణనీయంగా నమోదైందని అంచనా వేస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు అన్ని పోలింగ్ బూత్‌లలో పురుఫుల కంటే మహిళా ఓటర్లు అధికంగా కనిపించారు. పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన మహిళలకు పసుపు-కుంకుమ అమలుచేయడం తమకు కలిసి వచ్చిందని సీనియర్ నేత ఒకరు తెలిపారు.
విద్యా వంతులు, విద్యార్థులు టీడీపీకే మొగ్గుచూపారని అంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో చంద్రబాబు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, రాష్ట్ర అభివృద్ధికి పథకాల రూపకల్పన, ఐటీ రంగం విస్తరణ, శాంతిభద్రతలు వంటి అంశాల వల్ల ఉన్నత, మధ్యతరగతి వర్గాలు టీడీపీకి మద్దతు తెలిపారని ఓటింగ్ సరళి పరిశీలించిన పార్టీ నేతలు తెలిపారు. ఇక పల్లెల్లో సంక్షేమం సూపర్ హిట్ అయ్యింది. ఓటు వేసే అవకాసం లేక, ఇంటికి వెళ్లి, మళ్ళీ తిరిగి రావటం చూస్తే,చ చరిత్రలో ఎప్పుడూ లేదని అంటున్నారు. రాష్ట్రంలో పోలింగ్ సరళిపై టీడీపీ అధిష్ఠానం ఆరా తీస్తున్నది. ప్రతి సెగ్మెంట్‌లో అభ్యర్థి విజయావకాశాలపై లెక్కలు వేస్తున్నది. 20-22 పార్లమెంట్, 120-130 అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని టీడీపీ ఖాతాలో చేరతాయి? అనేది అభ్యర్థితో పాటు సీనియర్ల నాయకుల నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారు.
టీడీపీకి ఎన్ని స్థానాలు వస్తాయన్న దానిపై అభ్యర్థులు, పార్టీ నేతలు లెక్కలు వేయడంతో బిజీగా వున్నారు. కొన్నిచోట్ల గతం కంటే మెజారిటీ తగ్గవచ్చునని అంటున్నారు. అయినప్పటికీ మహిళల నిశ్శబ్ద ఓటింగ్ వల్ల ఆ స్థానాలు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదని సీనియర్ నేత ఒకరు ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీ గట్టి పోటీ ఇవ్వడంతో కొన్ని స్థానాల్లో పరిస్థితి నువ్వా? నేనా? అన్నట్టుగా వుందని విశ్లేషించారు. ఇక్కడ కూడా మహిళలు, రైతులు, పింఛన్‌దారులు టీడీపీకి గంపగుత్తగా ఓటేశారని, అందువల్ల కొద్ది మెజారిటీతో అయినా నెగ్గుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా 130 దాకా గెలుచుకుంటాం అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కూడా ఉదయం జరిగిన టెలి-కాన్ఫరెన్స్ లో ఇదే విషయం స్పష్టం చేసారు. ఈవీయం ల బధ్రత పై జాగ్రత్తలు చెప్పారు.