వైసీపీ నేత.. ఆ పార్టీ తరఫున విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పొట్లూరి వరప్రసాద్‌కు (పీవీపీ) సెబీ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన పీవీపీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ షేర్ల క్రయవిక్రయాలను సోమవారం నుంచి నిలిపివేసింది. సెబీ మార్గదర్శకాలను, నిబంధనలను ఉల్లంఘించినట్లు.. ముఖ్యంగా, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో, వేలాదిమంది షేర్‌హోల్డర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వివిధ పేర్లతో కంపెనీలు ఏర్పాటు చేసి వాటిని ప్రధాన కంపెనీలో విలీనం చేసి లాభాలు ఆర్జిస్తున్నట్లు ప్రచారం చేసి.. తద్వారా మదుపర్ల నుంచి పెట్టుబడులు వచ్చి షేరు ధర పెరిగిన తర్వాత ప్రమోటర్లు తమ షేర్లను విక్రయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సెబీ గతంలోనే భారీ జరిమానా విధించింది.
దాదాపు రూ.20 కోట్ల దాకా జరిమానాను పీవీపీ వెంచర్స్ చెల్లించాల్సి ఉంది. అయితే, పలు అవకాశాలిచ్చినప్పటికీ సదరు సంస్థ జరిమానా చెల్లించకపోవడంతో సెబీ కఠిన నిర్ణయం తీసుకుంది. కాగా.. పీవీపీ దీనికి సంబంధించిన వివరాలను తన ఎన్నికల అఫిడవిట్‌లోనూ పేర్కొన్నారు. సెబీకి తాను దాదాపు రూ. 7 కోట్లు చెల్లించే అంశంపై ముంబై సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎస్‌ఏటీ)లో విచారణ జరుగుతోందని అందులో వెల్లడించారు. కంపెనీ నిర్వాకం కారణంగా ట్రేడింగ్ నిలిపివేయటంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. సెబీ నిర్ణయంతో వేలాది మంది వాటాదారులు నష్టపోయారని మార్కెట్ వర్గాలంటున్నాయి.
జరిమానాను చెల్లించేందుకుగాను.. పీవీపీ వెంచర్స్‌కు తమ భూములను ఇవ్వడానికి అభ్యంతరం లేదని రెండు రియల్ ఎస్టేట్ సంస్థలు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి స్పష్టం చేశాయి. ఆరేటి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎక్స్‌ప్రెషన్స్ రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు మొత్తం 53 ఎకరాల భూమిని అందించేందుకు ముందుకు వచ్చాయని ఈ ఏడాది ఫిబ్రవరిలో సెబీ వెల్లడించింది. ఈ భూములు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం నాదర్‌గుల్ గ్రామ పరిధిలోని 609 సర్వే నెంబరులో ఉన్నాయని పేర్కొంది. ఈ విషయంలో 7 వేర్వేరు నెంబర్లతో కూడిన ఒరిజినల్ సేల్‌డీడ్స్‌ను తమకు అందించారని వివరించింది. ఈ భూములను విక్రయించడం కాని, కొనుగోలు చేయటాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేసింది.