ఒక పక్క ఎన్నికలు జరిగిన సరళి, ప్రజలు పడిన ఇబ్బందులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మారుమోగితే, జగన్ మాత్రం తీరిగ్గా లోటస్ పాండ్ నుంచి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కేసీఆర్, చంద్రబాబుకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్‌తో తనకు సంబంధం లేదని జగన్ అన్నారు. అది కేసీఆర్, చంద్రబాబులకు సంబంధించిన అంశమన్నారు. హైదరాబాద్‌లో తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఓటింగ్ శాతం తగ్గించేందుకు కుయుక్తులు పన్నారన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని.. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలన్నారు. ఓటమి తప్పదని చంద్రబాబు నిర్ధారణకు వచ్చారని .. ఓటింగ్ శాతం తగ్గిచేందుకు చంద్రబాబు కుట్రలు చేశారన్నారు.
80శాతం మంది ప్రజలు పోలింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు బురదజల్లుతున్నారని విమర్శించారు. ఎన్నికల కమిషన్ అద్భుతంగా పని చేసిందని కొనియాడారు. మంగళగిరిలో లోకేశ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. ఓడిపోతున్నాడని తెలుసుకాబట్టే ఈసీని బెదిరిస్తున్నారన్నారు. అనేక రకాలుగా ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశారన్నారన్నారు. ఓటర్లు తాము ఏ పార్టీకి ఓటు వేశామో వీవీప్యాట్స్ ద్వారా చూసుకుని సంతృప్తి చెందితే, ఇంకా, నెగెటివ్ కామెంట్స్ ఎవరు చేస్తారని అన్నారు. ఓడిపోతున్నాం కనుక బురదజల్లాలని అనుకునేవాళ్లే నెగెటివ్ కామెంట్స్ చేస్తారంటూ టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఈవీఎంలపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు జగన్ స్పందిస్తూ.. ప్రజల దయ, దేవుడి ఆశీస్సులతో వైకాపా అఖండ విజయం సాధించబోతోందని విశ్వాసం వ్యక్తంచేశారు. అయితే జగన్ వ్యాఖ్యల పై, ఆంధ్రప్రదేశ్ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి తొమ్మిది దాటినా, ఇంకా పోలింగ్ జరుగుతుందని, ఈ పరిస్థితికి కారణం అయిన ఎలక్షన్ కమిషన్ వైఖరిని ఏ మాత్రం ప్రశ్నించకుండా, ప్రజలు పడిన ఇబ్బందులు పట్టించుకోకుండా, ఎలక్షన్ కమిషన్ అద్బుతంగా పని చేస్తుందని లోటస్ పాండ్ నుంచి చెప్పటంతో, ఏపి ప్రజలు అవాక్కయ్యారు.