మొన్నటి వరకు అనధికార మిత్రులుగా ఉన్న వైసీపీ, బీజేపీ పార్టీలు, ఇప్పుడు ఒకరి పై ఒకరు రాజకీయ దాడులు చేసుకుంటున్నాయి. నిన్న జగన్ యాంటీ హిందూ అంటూ, బీజేపీ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. ఈ రోజు కూడా జగన్ ప్రభుత్వం పై బీజేపీ పార్టీ విరుచుకు పడింది. వరదలల్లో సరిగ్గా వాటర్ మ్యానేజ్మెంట్ చేయ్యక పోవటం, పోలవరం టెండర్లు, రాజధాని తరలింపు పై, బీజేపీ, వైసిపీ పై రాజకీయ దాడి చేస్తుంది. అయితే ఈ రోజు విజయసాయి రెడ్డి చాలా రోజుల తరువాత మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఇన్ని విమర్శలు చేసినా, వారిని ఒక్క మాట కూడా అనే సాహసం చెయ్యలేదు. వారిని ఏమి అనకపోగా, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా పై ప్రశంసలు కురిపించారు. అయితే, పోలవరం ప్రాజెక్ట్ విషయం పై, విద్యుత్ ఒప్పందాల సమీక్ష పై, కేంద్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది కదా అని విలేఖరులు ప్రశ్నించారు.
దీనికి విజయసాయి రెడ్డి సమాధానం చెప్తూ, జగన్ మోహన్ రెడ్డి ఏమి చేసినా, మోడీ, అమిత్ షాలకు చెప్పే చేస్తారని చెప్పారు. వారి అనుమతితోనే అన్ని పనులు చేస్తారు అంటూ, పోలవరం రివర్స్ టెండరింగ్, విద్యుత్ ఒప్పందాల సమీక్షను, మోడీ, షా ల పై తోసేసే ప్రయత్నం చేసారు. అయితే విజయసాయి రెడ్డి వ్యాఖల పై, బీజేపీ పార్టీ వెంటనే స్పందించింది. ముందుగా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ, పోలవరం టెండర్ల విషయంలో, విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో, కేంద్ర ప్రభుత్వం వద్దు అని చెప్తున్నా, జగన్ మోహన్ రెడ్డి, ఆయన ఇష్టం వచ్చినట్టు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రధాని మోడీ చెప్పిన మాట వినటం నేర్చుకోవాలి అంటూ మండి పడ్డారు.
ఇక కొద్ది సేపటికే, విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి. ఢిల్లీలో ఈ రోజు సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తో చర్చలు జరిపి, వారి అంగీకారం తరువాతే పోలవరం విషయంలో, విద్యుత్ ఒప్పందాల విషయంలో ముందుకు వెళ్తున్నాం అని చెప్పిన విజయసాయి రెడ్డి మాటలు కరెక్ట్ కాదని సుజనా అన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పరిపలన ఉండదని, ఎవరి నిర్ణయాలు వారు తీసుకుంటారనే విషయం విజయసాయి రెడ్డి గుర్తుంచుకోవాలని అన్నారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు వింతగా ఉన్నాయని అన్నారు. అసలు ఏ ప్రాతిపదికన, మోడీ, అమిత్ షా, మీకు భోరోసా ఇస్తారని సుజనా ప్రశ్నించారు. ఇలాంటి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు అని, కేంద్రం చెప్పే ప్రతి అభ్యంతరానికి, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుందని, విజయసాయి రెడ్డి గుర్తుంచుకోవాలని అన్నారు.