గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో, 50 మందికి పైగా చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా 13 మృతదేహాల దాక ఇంకా వెతకాల్సి ఉంది. అయితే బోటు ఎక్కడో 300 అడుగుల దూరంలో ఉందని, అది బయటకు తియ్యటం కష్టం అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే బోటును గోదావరి నదిలో గుర్తించిన వెంకటశివ మాత్రం ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం జరిగిన రెండో రోజే మేము బోటును గుర్తించామని, రన్నింగ్ పంటు ఒకటి , రోప్ ఇస్తే 2 గంటల్లో బోటు తీస్తానని ప్రభుత్వానికి చెప్పానన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ ప్రతిపాదనకు ముందుకు రాలేదని, మేము బోటుని గుర్తించాం, బయటకు తీస్తాం, రెండు గంటలు చాలు అని చెప్పినా, ప్రభుత్వం మాత్రం ముందుకు రాలేదని అన్నారు. అయితే, బోటు బయటకు తీయడం అధికారులకు, ప్రభుత్వానికి ఇష్టం లేదని అర్ధమవుతుందని అన్నారు.
పర్యాటక అధికారులు, బోటు యజమానులు అక్కడ జరుగుతున్నవి కాకుండా, వేరేవి చెప్పి, తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బోటును గుర్తించడానికి, ఎక్కడో ఉత్తరాఖండ్ నుంచి నిపుణులు అవసరం మనకు లేదని కొట్టిపారేశారు. ఆ బృందం తీసుకొచ్చిన కెమెరాలు గోదావరి నదిలో సరిగా పనిచేయడం లేదని వెంకటశివ చెప్పారు. నదుల్లో చిక్కుకున్న బోట్లను బయటకు తీయడంలో వెంకటశివ ఎక్స్‌పర్ట్ అని, ఆయన్ను అధికారులు సంప్రదించటంతో ఆయన వచ్చి బోటుని బయటకు తీసే విషయం పై అంచనాకు వచ్చారని చెప్తున్నారు. అయితే వెంకటశివ ప్రతిపాదనను ప్రభుత్వం ఎందుకు తిరస్కరించింది ? వెంటక శివ ఆరోపణలు నిజామా కాదా అనేది, ఇప్పటి వరకు ఏ అధికారి స్పందించలేదు.
మరో పక్క రెండు రోజుల నుంచి, బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రి అవంతి శ్రీనివాస్ ని టార్గెట్ చేస్తూ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. బోటును వెలికితీయడం అధికారులకు ఇష్టం లేదన్నారు. అలాగే బోటులో 73 మంది కాదని, 93 మంది ఉన్నారని, బోటు బయటకు తీస్తే, ఎక్కువ మంది మృతదేహాలు ఉంటాయనే, ప్రభుత్వం బోటుని బయటకు తియ్యటం లేదని అన్నారు. టూరిజం బోట్లలో మంత్రులు, ఎమ్మెల్యేలకు వాటాలున్నాయని ఆరోపించారు. ప్రమాదం ముందు పోలీసులు తీసిన ఫొటోలు, సెల్‌ఫోన్ సంభాషణలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బోటు జాడ సోమవారమే తెలిసిందని హర్ష కుమార్ ఆరోపించారు. అయితే ఇప్పుడు హర్ష కుమార్ మాటలకు బలం చేకూరుస్తూ, వెంకట శివ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.