రాజకీయాల్లో, ప్రత్యర్ధుల పై కక్షలు తీర్చుకోవటం, ఇప్పుడు సర్వ సాధారణం అయిపొయింది. వ్యవస్థల మీద ఇప్పటికే ప్రజలకు నమ్మకం పోయింది. ఇది వరకు రాజకీయం అంటే, విధానాల పై నడిచేది. నువ్వు చేసింది తప్పు అని, లేకపోతే కరెక్ట్ అని, ప్రజల ముందు చర్చకు పెట్టే వారు. ప్రజలు అన్నీ గమనించి నిర్ణయం తీసుకునే వారు. కాని రాను రాను రాజకీయం అంటే, వ్యక్తిగత కక్ష కంటే ఘోరం అయిపొయింది. ప్రత్యర్ధి పార్టీలోని వ్యక్తుల పై, అధికారంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవస్థలను వాది, తమ వైపు తిప్పుకోవటం, లేకపోతె కక్ష తీర్చుకోవటం చాలా సాధారణ విషయం అయిపొయింది. ప్రజలు కూడా దీనికి ట్యూన్ అయిపోయారు. రాజకీయ నాయకులు సవాళ్లు చేసుకుంటూ ఉంటారు కాని, ఎన్నికలు అయిపోగానే ఎవరు పని వాళ్ళు చూసుకుంటారు. సమస్య తీవ్రతను బట్టి, కేసులు వరకూ వెళ్తూ ఉంటాయి. కాని ఇలాంటి సందర్భాలు మొన్నటి వరకు చాలా తాక్కువ.
చంద్రబాబు అధికారంలో ఉండగా, రాజకీయ విమర్శలు చేస్తూ ఉండేవారు కాని, ప్రతి చిన్న దానికి కేసులు పెట్టి, నాయకులను ఇబ్బంది పెట్టటం చాలా తక్కువ. ఉదాహరణకు బెట్టింగ్ కేసులో, ఇప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై, అప్పట్లో సీరియస్ కేసు నడిచింది. అప్పట్లో వచ్చిన వార్తలను బట్టి, అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ అవుతరాని అందరూ అనుకున్నారు. కాని, రొటీన్ విచారణ చేసి, వదిలేసారు. కాని ఇప్పటి ప్రభుత్వం, చంద్రబాబులా చూసి చూడనట్టు వదలటం లేదు. ఏ చిన్న ఆధారం దొరికినా, పెద్ద నాయకుడు నుంచి, కింద స్థాయి కార్యకర్త వరకు, ఇబ్బందులు పెడుతున్నారు. కోడెల, యరపతనేని, కూన రవి కుమార్, చింతమనేని, సోమిరెడ్డి, ఇలా వరుస పెట్టి నేతలను టార్గెట్ చేస్తున్నారు. మరో పక్క సోషల్ మీడియాలో చిన్న వ్యతిరేక పోస్టింగ్ వేసినా, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపిస్తుంది వైసిపీ.
అయితే ఇప్పుడు చింతమనేని విషయంలో, ఆ చిన్న ఆధారం లేకుండా కూడా అరెస్ట్ చేసారని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి సంచలన విషయం నిన్న గుంటూరు పార్టీ ఆఫీస్ సాక్షిగా చెప్పారు. చింతమనేని ప్రభాకర్ తమను అసలు దుర్భాషలాడలేదని, చింతమనేని పై కేసు పెట్టిన వ్యక్తలు చెప్పారు. ఇసుక తోలుకుంటున్న తమను కులం పేరుతో చింతమనేని దూషించారని చెప్తూ, పోలీసులు తమను బెదిరించి ఆయన పై కేసు పెట్టించారని పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమికి చెందిన జోసఫ్ రామకృష్ణ, సందీప్ కుమార్ తెలిపారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం వారు న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబుతో కలిసి మీడియా ముందు మాట్లాడారు. చింతమనేని పై బలవంతంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారని, చింతమనేని మైనింగ్ జరుగుతున్న ప్రదేశానికే రాలేదని, అలాంటిది తమను ఎలా దూషిస్తారు, కొడతారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు, స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో పోలీసులు కేసులో ఇరికించారని తెలిపారు. తాము ఎడ్లబండిపై ఇసుక తోలుకుంటామని రామకృష్ణ, సందీప్‌కుమార్ చెప్పారు. ప్రభాకర్ తమపై దాడి చేయలేదని తెలిపారు. తమవెంట వస్తానన్న జోసఫ్‌ను పోలీసులు అడ్డుకున్నారన్నారు.