ఈ రోజు చలో ఆత్మకూరు పిలుపుతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామాల్లో ఉండనివ్వకుండా, వికృతంగా ప్రవర్తించి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, గ్రామాల నుంచి తరిమేసిన వైసీపీ పై, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చలో ఆత్మకూరు నిర్వహించారు. ఈ క్రమంలో, చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. ఉదయం చంద్రబాబును కలిసేందుకు వస్తున్న టీడీపీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకురు. వచ్చిన వారిని వచ్చినట్టు చంద్రబాబు నివాసం దగ్గరే అరెస్ట్ చేసి తరలించేసారు. ఇదే క్రమంలో, చంద్రబాబు నివాసంలోకి వెళ్లేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే అనితలు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని, అరెస్ట్ చేసే ప్రయత్నం చెయ్యటంతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మాట మాట పెరిగింది.
ఈ వాగ్వాదం జరిగిన క్రమంలో, టీడీపీ నేతలు తనను కులం పేరుతో దూషించారంటూ మహిళా ఎస్సై అనురాధ ఆరోపించారు. తరువాత నన్నపనేని రాజకుమారితో పాటు, మాజీ ఎమ్మెల్యే అనితను చేబ్రోలు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఈ క్రమంలో వైసిపీ నేతలు, వాళ్ళ అనుకూల మీడియా, రాజకుమారి, మహిళా పోలీస్ ని కులం పేరుతొ దూషించారు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. కాని అలనాటి వీడియో మాత్రం వెయ్యలేదు. వివాదం జరిగిన క్రమంలో మహిళా పోలీస్ ఆగ్రహం వ్యక్తం చేసిన మాటలు చూపించారు కాని, నన్నపనేని అన్న మాటలు ఎక్కడా వెయ్యలేదు. మహిళా పోలీస్ కూడా, ఎక్కడా కులం పేరుతొ దుషించినట్టు ఆ వీడియోలో లేదు. అయిన వైసీపీ ఇలా ప్రచారం చేసింది. దీంతో విషయం తెలుసుకున్న మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి కన్నీటి పర్యంతమయ్యారు.
70 ఏళ్ళ వయస్సులో ఉన్న నన్ను, తమ అధినేత దగ్గరకు వెళ్తుంటే అరెస్ట్ చేసారని, అలా ఇబ్బంది పెట్టవద్దు ‘మీకు దండం పెడతాను.. నన్ను వదిలేయండి’ అని పోలీసులను వేడుకున్నా వదలలేదని అన్నారు. జగన్ ప్రభుత్వం తనను మానసిక ఒత్తిడికి గురిచేసి మహిళా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేయించిందని ఆమె సంచలన ఆరోపణ చేశారు. మహిళా పోలీసు తన పై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, తాను అవమానకరంగా మాట్లాడినట్లు నిరూపిస్తే ఆత్మహత్యకు సిద్ధమని ఆమె సవాల్ చేశారు. ఆమె ఏ కులమో తనకు ఎలా తెలుస్తుందని, ఆమె పోలీస్ ఉనిఫోరం లో ఉంటుంది కదా అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం దళితులను వాడుకోవడం సిగ్గుచేటు అని మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. జరగని విషయాన్ని పదే పదే చెబితే నిజం కాదన్నారు. తాను కూడా దళిత మహిళానేనని చెప్పారు. తాను గర్వంగా దళితురాలినని చెప్పుకుంటానన్నారు. మహిళా పోలీసు దళితురాలు అని ఎలా తెలుసుందన్నారు. మహిళా పోలీసును టీడీపీ నేతలు దూషించినట్లుగా అసత్య ప్రచారాలు చేయడం మంచిది కాదని సూచించారు.