రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు, అసలు అమరావతి ఉంటుందా ఉండదా అనే సందేహాల నేపధ్యంలో, ఇప్పుడు అమరావతిలో నిర్మించ తలపెట్టిన, తిరుమల తిరుపతి దేవస్థానం పై కొత్తగా ఎన్నికైన పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. జగన్ బాబాయ్ వైవి సుబ్బా రెడ్డి, టిటిడి చైర్మెన్ అయిన విషయం తెలిసిందే. చంద్రబాబు హయంలో, అమరావతిలో నిర్మించ తలపెట్టిన శ్రీవేంకటేశ్వర దివ్యక్షేత్రం ఆలయాన్ని పెద్ద ఆలయంగా కాకుండా, చిన్నదిగా నిర్మించే అంశాన్ని ఈ కొత్త పాలకమండలి పరిశీలిస్తుంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో 25 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో పాటు, తిరుమల తిరుపతు దేవస్థానం నిర్ణయం తీసుకున్నారు. ఈ బాధ్యత మొత్తాన్ని టిటిడినే తీసుకుంది. ఇందుకు తగ్గట్టుగానే, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా భూకర్షణ క్రతువు పూర్తిచేసారు.
చంద్రబాబు హయంలోనే పనులు కూడా ప్రారంభం అయ్యాయి. రూ.150 కోట్ల ఖర్చుతో శ్రీవారి ప్రధాన ఆలయంతో పాటు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం కూడా నిర్మించటానికి నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన ఆలయాలతో పాటుగా, నైవేద్యం తయారీకి వంటశాల, ఉత్సవ మండపం, రథ మండపం, ప్రసాద మండపాలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా, స్వామివారి పుష్కరిణి, వసతి సముదాయాలు, అన్నప్రసాదం కాంప్లెక్స్, ఆధ్యాత్మిక గ్రంథాలయం, కార్యాలయ భవనాలు, సిబ్బందికి అవసరమైన ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీటికి సంబంధించి రూ.10 కోట్ల విలువైన పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. తిరుమలలో గుడి ఎలా ఉంటుందో, అలాగే నిర్మించాలని, అనుకున్నారు.
అయితే ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, వారి ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి. ఈ నిర్మాణానికి, ప్రభుత్వానికి సంబంధం లేదు. పూర్తిగా టిటిడి ఖర్చుతో నిర్మాణం జరుగుతుంది. అయినా సరే, ప్రభుత్వం, ఈ ఆలయం విషయంలో తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు, తిరుమలలో శ్రీవారి ఆలయంలోని వెండి వాకిలి వరకు తొలుత అంతర్గత ప్రాకారం మాత్రమే నిర్మించాలని టిటిడి పాలకమండలి నిర్ణయం తేసుకున్నారు. మిగిలిన నిర్మాణాలపై తదుపరి పాలక మండలి సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, శ్రీవారి ఆలయం ముందు అనుకున్నట్టే కట్టాలని, దేవుడి విషయంలో కూడా ఇలా నిర్ణయాలు మార్చుకోవటం సరి కాదని, శ్రీవారి భక్తులు అంటున్నారు. అనవసరమైన వాటికి వేల వేల కోట్లు ఖర్చు పెడుతూ, రాష్ట్రాన్ని చల్లగా చూసే శ్రీవారికి కంచెం పెద్దదిగా గుడి కడితే ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు.