తెలుగు తల్లి... తెలంగాణా నుంచి విడిపోయినా, ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుంటారు. ముఖ్యంగా, ‘‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. మా కన్నతల్లికి మంగళారతులు..’’ అనే పాట వింటే రోమాలు నిక్కబొడుచుకోని ఆంధ్రుడు ఉండడు అంటే ఆశ్చర్యం కాదు. అయితే ఏమైందో ఏమో కాని, ‘‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. మా కన్నతల్లికి మంగళారతులు..’’ అనే పాట, ఈ మధ్య ఏ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలోనూ వినపడటం లేదు. ఇంతకు ముందు ఎవరు అధికారంలో ఉన్నా సరే, ఏ అధికారిక కార్యక్రమం అయినా, ఈ పాటతోనే మొదలయ్యేది. మరి ఏమైందో ఏమో కాని, జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఈ పాట మరుగున పడిపోయింది. ఈ మధ్య చంద్రబాబు కూడా ఈ విషయం పై ట్వీట్ చేస్తూ ఆయన అభిప్రాయన్ని చెప్పినా, ఈ విషయం పై పట్టించుకునే వారే లేరు. ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందా అనే భాషా ప్రేమికులు అంటున్నూర్.
ఈ నేపధ్యంలోనే నిన్న తెలుగు భాషా దినోత్సవం రోజు వచ్చింది. అయితే విజయవాడ నడిబొడ్డున ఉన్న తెలుగుతల్లి విగ్రహానికి కనీసం పూలమాల వేసేవారు కనిపించలేదు. తెలుగు భాషా దినోత్సవం రోజు కూడా, తెలుగు తల్లిని అలంకరించలేదు. రాజధాని ప్రాంతం కావడంతో పాటు అధికార భాషాసంఘం, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యాలయాలూ ఇక్కడే ఉన్నా, తెలుగు తల్లి విగ్రహాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. మరోవైపు, తెలుగుతల్లి విగ్రహం ఉన్న తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలోనే జాతీయ క్రీడాదినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అధికార యంత్రాంగమంతా పాల్గొంది. వారిలో ఒక్కరికీ తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేయాలన్న ఆలోచన రాకపోవడం విచారకరం.
ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే, తెలుగు భాషా దినోత్సవం కోసం అంటూ, ప్రభుత్వం 18 లక్షలు విడుదల చేసి, ఒక జీవో ఇచ్చింది. మరి ఈ 18 లక్షల్లో కనీసం, తెలుగు తల్లికి ఒక పూల మాల వెయ్యాలనే సోయ, ఎవరికీ లేకుండా పోయింది. మొన్నీ మధ్యే జగన్ ప్రభుత్వం, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా కూడా చేసారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మొన్నటి దాక, చంద్రబాబు ప్రభుత్వం పై నిప్పులు చెరిగే వారు. చంద్రబాబు ప్రభుత్వం తెలుగు భాషకు సరైన గుర్తింపు ఇవ్వటం లేదని విమర్శలు చేస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఆయన రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా ఉంటూ, విజయవాడలో తెలుగు తల్లి విగ్రహానికి జరిగిన అవమానం గురించి ఎవరిని విమర్శ చేస్తారో మరి ?