వారం రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న హాట్ టాపిక్, అమరావతి మార్పు వార్తలు. వారం రోజుల క్రితం బొత్సా చేసిన వ్యాఖ్యలు, ఇప్పటికీ మండుతూనే ఉన్నాయి. జగన్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు అమరావతి పై ప్రకటనలు చెయ్యటం పై, రాజధాని అమరావతి రైతులు రోడ్డెక్కారు. జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ఒక పక్క కౌలు డబ్బులు ఇవ్వటం లేదని, ఇప్పుడు ఏకంగా రాజధానినే మార్చేస్తాం అంటున్నారని మండిపడ్డారు. రాజధాని తరలించాలి అంటే, మా శవాల పై తీసుకువెళ్ళండి అంటూ, పురుగుల మందు డబ్బాలతో ధర్నా చేసారు. అమరావతికి వరద ముంపు అంటూ కొత్త రాగం అందుకున్నారని, మేము ఇక్కడ తరతరాలుగా ఉండటం లేదా, అప్పుడు లేని వరద, ఇప్పుడు వస్తుందా అంటూ జగన్ ప్రభుత్వ వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీకి చెందిన సానుభూతి పరులు కూడా ఈ ధర్నాలో పాల్గున్నారు.
అయితే రాజధాని రైతుల ఆందోళన పై, బొత్సా ఈ రోజు స్పందించారు. వాళ్ళు ఆందోళన చేసేది కౌలు డబ్బులు కోసం అని, అమరావతి రాజధాని గురించి కాదని, అన్నారు. ఒక రకంగా, రైతులను హేళన చేసారు. ఇదే సమయంలో అమరావతి పై మళ్ళీ అవే వ్యాఖ్యలు చేసారు. అమరావతికి ముంపు ఉందని, ముంగిపోతుందని బొత్సా అన్నారు. అలాగే తెలుగుదేశం, బీజేపీ, జనసేన చేసిన వ్యాఖ్యల పై కూడా బొత్సా స్పందించారు. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. అమరావతిలో అతి పెద్ద భూకుంబకోణం జరిగిందని, ఇన్‌సైడ్ ట్రేడింగ్ వివరాలను సరైన సమయంలో బయటపెడతామని బొత్సా అన్నారు. ఆ చిట్టా సరైన సమయంలో బయట పెడతామాని అన్నారు.
ఇదే సమయంలో అటు పవన్ కళ్యాణ్ పై, ఇటు బీజేపీ పై కూడా బొత్సా మండి పడ్డారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి ఛాలెంజ్ విసిరారు. రేపు సుజనా చౌదరి, బీజేపీ పార్టీ తరుపున, రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించే సమయంలో, ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బొత్స మాట్లాడుతూ, నిన్న ఒక కేంద్ర మాజీ మంత్రి మాట్లాడుతూ, ఆయనకు ఇక్కడ ఒక్క సెంట్ కూడా భూమి లేదని అన్నారు, ఆయనకు ఇదే మా ఛాలెంజ్. మీకు ఇక్కడ భూమి ఉందొ లేదో, మీరు దమ్ముంటే మమ్మల్ని చూపమని అడగండి, మేము చూపిస్తాం. ల్యాండ్ రికార్డ్స్ కూడా చూపిస్తాం, రెడీనా అంటూ సుజనా చౌదరికి బొత్సా ఛాలెంజ్ చేసారు. మరి రేపు, అమరావతిలో పర్యటించే, సుజనా చౌదరి, ఈ ఛాలెంజ్ పట్ల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.