జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. ఈ మూడు నెలల కాలంలో, రివెర్స్ టెండరింగ్, ఆపివేతలు, కూల్చివేతలు, ఎంక్వయిరీలు, ఇలా సాగుతుంది పాలన. జగన్ చెప్పిన నవరత్నాలు, ఇంకా మొదలు కాలేదు. వాలంటీర్లు వ్యవస్థ రాగానే, పల్లెలు మారిపోతాయి అన్నారు కాని, వీళ్ళు కూడా పెద్దగా మార్పు ఏమి చూపించలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం, ఒక మార్క్ పాలన అయితే చూపించే కుతూహలం ఉంటుంది. అలాంటి మార్క్ ఏమి ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చూపించలేదనే చెప్పాలి. పాలన అంతా రొటీన్ గా సాగుతుంది. విజయవాడ ధర్నా చౌక్ ప్రతి రోజు బిజీగానే ఉంటుంది. ఈ క్రమంలో, జగన్ మోహన్ రెడ్డి, తన మంత్రి వర్గం పై ఒక యనాలసిస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన మంత్రి వర్గంలో మంత్రులకు, పదవీ కాలం కేవలం రెండున్నర ఏళ్ళే అని ఇది వరకే చెప్పారు.
90 శాతం మంది మంత్రులను మార్చేసి,కొత్త వారికి అవకాసం ఇస్తానని జగన్ చెప్పారు. ఈ క్రమంలో, జగన్ మోహన్ రెడ్డి, తన మంత్రి వర్గంలో ఉన్న మంత్రుల పని తీరు పై, సన్నిహితులతో చర్చించారు. ఎవరు సమర్ధవంతంగా పని చేస్తున్నారు ? ఎవరు ప్రతిపక్షాలకు ధీటుగా జవాబు ఇస్తున్నారు ? ఎవరు ఎప్పటికప్పుడు మీడియాతో మాట్లాడుతూ అపోహలు తొలగిస్తున్నారు, వంటి వాటిని బేరీజు వేసుకుని, జగన్ మోహన్ రెడ్డి టాప్ 5 మంత్రులను గుర్తించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ అయుదుగురు మంత్రులు ఇలాగే పని చేస్తే, వీరికి పూర్తీ కాలం, అంటే 5 ఏళ్ళ పాటు మంత్రులుగా కొనసాగిస్తారని చెప్పినట్టు సమాచారం. 25మంది మంత్రులలో, ఈ ఐదుగురు పని తీరు, జగన్ కు బాగా నచ్చిందని చెప్తున్నారు.
ముందుగా, మోపిదేవీ వెంకటరమణ పేరు వినపడుతుంది. మోపిదేవి వెంకట రమణ రేపల్లె నుంచి పోటీ చేసి ఓడిపోయినా సరే, ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు జగన్. జగన్ కేసుల్లో ఈయన కూడా జైలు శిక్ష అనుభవించారు. ఈ నేపధ్యంలోనే మోపిదేవీ వెంకటరమణకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇప్పుడు మోపిదేవీ వెంకటరమణ బాగా పని చేస్తున్నారని జగన్ నమ్ముతున్నారు. ఇక తరువాత, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. మూడో స్థానంలో, మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రరెడ్డి, నాలుగో స్థానంలో ఉత్తరాంధ్రలో కీలక నేత బొత్సా సత్యనారాయణ, అయిదవ స్థానంలో బాలినేని శ్రీనివాసరెడ్డిలు ఉన్నారని తెలుస్తుంది. ఈ అయిదుగురి పై, జగన్ ఎంతో నమ్మకంతో ఉన్నారని, వీరికి ఫుల్ టైం మంత్రి పదవి లభిస్తుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.