కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు ఫోన్ చేశారు. యురేనియం తవ్వకాలకు అందరం కలిసి, పోరాడదామని , దీనికి కలిసి రావాలని, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డిని కోరారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సోమవారం ఉదయం 10 గంటలకు దస్పల్లా హోటల్‌లో అఖిలపక్ష సమావేశం ఎర్పాటు చేసామని, అందులో పాల్గొనాలని, రేవంత్ ను పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. పవన్ ఆహ్వానానికి రేవంత్ స్పందిస్తూ, తప్పకుండా వస్తానని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వీ హనుమంతు రావు నేతృత్వంలో ఈ అఖిలపక్ష సమావేశం జరగనుంది. వారం రోజుల క్రిందట, వీహెచ్, పవన్ కళ్యాణ్ కలిసి, ఈ ఉద్యమంలో కలిసి రావాలని కోరారు. వీహెచ్ పిలుపుకు స్పందించిన పవన్ కళ్యాణ్, యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జనసేన కలిసి వస్తుందని చెప్పారు.
తెలంగాణా భూభాగంలో, నల్లమల అడవులలోని అమ్రాబాద్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి యురేనియం తవ్వకాలు జరపాలని నిర్ణయం తీసుకుంది. అయితే దీని పై అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బ తింటుందని, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రభావం కలుగుతుందని, మేధావులు, సామాన్య ప్రజలు నిరసన తెలుపుతున్నారు. దీని పై సినీ ప్రముఖులు కూడా తమ నిరసన తెలిపారు. ఇప్పటికే పవన్ కల్యాణ్, విజయ్ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్, అనసూయ వంటి సినీ సెలబ్రిటీలు నల్లమల అడవులను కాపాడాలని, యురేనియం తవ్వకాలకు ఉద్యమించాలని ప్రజలకు పిలుపిచ్చారు. తాజాగా సినీ హీరోయిన్ సమంత కూడా యురేనియం తవ్వకాల నుండి నల్లమల అడవిని కాపాడండి అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కోరింది.
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలతో పర్యావరణానికి నష్టం కలుగుతుందని, యావత్తు జీవ రాసుల, జీవవైవిధ్యం నాశనమవుతుందని అనేక మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాలతో కృష్ణా జలాలు కలుషితమయితే, ప్రజలు క్యాన్సర్, మూత్రపిండ వ్యాధుల బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలతో తెలంగాణా ప్రాంతమే కాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా ముప్పు ఉంటుందని మేధావులు చెబుతున్నారు. నల్లమల అడువుల్లో జీవవైవిధ్యం దెబ్బతిని వేలాది సంఖ్యలో జంతువులు మృత్యువాత పడతాయని, అక్కడ నివసించే గిరిజనులుకు కూడా ప్రమాదం అని అంటున్నారు. ఇప్పటికే ఈ విషయం పై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది.