ప్రధాని మంత్రి కార్యాలయం అంటే ఆషామాషీ కాదు. ఆవలిస్తే, పేగులు లెక్క పెట్టే వారు ఉంటారు అక్కడ. అక్కడకు వచ్చే ప్రతి వినతి పత్రం విషయంలో, ఎంతో లోతుగా ఆలోచనలు జరుపుతారు. దాని వెనుక ఉన్న రాజకీయ, ఆర్ధిక కోణాలను విశ్లేషించి, అన్ని విషయాలు ప్రధానమంత్రికి చెప్తారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి చేసిన ఒక వినతి కూడా, ప్రధాన మంత్రి కార్యాలయంలో చర్చకు దారి తీసింది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే, తెలంగాణాలో పని చేస్తున్న స్టీఫెన్ రవీంద్రను, తెలంగాణా నుంచి డిప్యుటేషన్ పై, ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావాలని జగన్ భావించారు. స్టీఫెన్ రవీంద్రకు , కీలకమైన ఇంటలిజెన్స్ చీఫ్ బాధ్యతలు ఇవ్వాలని, జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కేసిఆర్ కూడా సరే అనటంతో, స్టీఫెన్ రవీంద్ర తెలంగాణాలో సెలవు పెట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనధికారికంగా, విధులు నిర్వహించారు.
అయితే ఇది కేవలం కేసీఆర్, జగన్ వ్యక్తిగత వ్యవహారం కాదు. ఇందులో రూల్స్ ఉంటాయి, కేంద్రం నిర్ణయం ఉంటుంది. ఎందుకు డిప్యుటేషన్ పై ఆ అధికారి రావాలి అనేది, స్పష్టంగా చెప్పాలి. సరైన కారణం లేకుండా, నాకు కావలి అంటే కేంద్రం పట్టించుకోదు. సరిగ్గా స్టీఫెన్ రవీంద్ర వ్యవహారంలో కూడా ఇదే జరిగింది. కేంద్ర హోం శాఖ, స్టీఫెన్ రవీంద్ర డిప్యుటేషన్ కు నో చెప్పింది. దీంతో జగన్ నిరాస చెందారు. ఇక మరో తెలంగాణా అధికారి శ్రీలక్ష్మి ని కూడా జగన్ డిప్యుటేషన్ పై తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారు. ఇప్పటికే అనేక సార్లు, కేంద్రంతో చర్చలు జరిపారు. విజయసాయి రెడ్డి, ఆమెను వెంట బెట్టుకు వెళ్లి మరీ, ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాని కలిసారు. జగన్ ఇది వరకు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కూడా ఆమెను వెంట తీసుకు వెళ్లారు.
మళ్ళీ నిన్న ఢిల్లీ వెళ్ళిన సమయంలో కూడా, శ్రీలక్ష్మిని వెంట తీసుకుని వెళ్లారు. జగన్ వెంట, విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పి.మిథున్‌రెడ్డి, లోక్‌సభ సభ్యులు వల్లభనేని బాలశౌరి (మచిలీపట్నం), రఘురామకృష్ణంరాజు (నరసాపురం) వై.ఎస్.అవినాష్‌రెడ్డి (కడప), రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు, మాటి మాటికీ తెలంగాణా ఐఏఎస్ అధికారి అని శ్రీలక్ష్మి రావటం పై, ప్రధాని కార్యాలయంలో చర్చ జరుగుతుంది. శ్రీలక్మ్షి కూడా జగన్ కేసులో ఉన్నారు. సహజంగా, ఒకే కేసులో సహా నిందితులుగా ఉన్న వారిని దూరం పెడతారు. కాని ఇక్కడ జగన్ మాత్రం, ఆ అధికారిని ఎలా అయినా డిప్యుటేషన్ పై, ఆంధ్రపదేశ్ తీసుకురావాలి అనుకోవటం పై, ప్రధాని కార్యాలయం ఆరా తీస్తుంది. జగన్ ఎందుకు ఇంత పట్టు పడుతున్నారు అనే విషయం పై, చర్చ చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు కేంద్రం మాత్రం, శ్రీలక్ష్మి డిప్యుటేషన్ కు, ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. స్టీఫెన్ రవీంద్ర విషయంలో వర్తించిన రూల్స్ , ఇక్కడ కూడా వర్తిస్తాయి కాబట్టి, ఆమె వచ్చే అవకాసం ఉండదు.