పేదల కష్టానికి ఇవ్వాల్సిన డబ్బులు, ఇతర ఖర్చులకు దారి మళ్ళించారా ? కేంద్రం డబ్బులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం అవి లబ్దిదారులకు ఇవ్వటం లేదా ? కష్టం చేసుకుని బ్రతికే పేదలకు, ప్రభుత్వమే ఇబ్బంది పెడుతుందా ? అవుననే సమాధానమే వస్తుంది. గ్రామీణ ఉపాధి హామీ పధకంలో భాగంగా, పేదల కష్టానికి ఇవ్వాల్సిన డబ్బులు, ఇప్పటికీ ఇవ్వలేదు అంటూ, ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ కౌన్సిల్, ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసింది. అయినా ఎటువంటి రెస్పాన్స్ లేకపోవటంతో, జరిగిన విషయం మొత్తాన్ని, కేంద్రం ద్రుష్టికి తీసుకువెళ్ళింది తెలుగుదేశం పార్టీ. కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఈ విషయంలో, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై, లేఖ రాశారు. ఉపాధి హామీ కోసం కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్రం వేరే వాటికి మళ్ళించిందని చెప్పారు.
పేదలకు ఇవ్వాల్సిన ఉపాధి హామీ డబ్బులు, ఈ నాలుగు నెలల్లో ఇవ్వలేదని, ఉపాధిహామీ పెండింగ్ బిల్లులు చెల్లింపునకు, కేంద్రం చొరవ తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు లో 2019 మొదటి వరకూ ఏపీ దేశంలోనే ప్రథమస్థానంలో ఉండేదని, నేడు అథమస్థానానికి పడిపోయిందని చంద్రబాబు అన్నారు. మొన్నటికి దాకా చేసిన పనులకు గాను, కేంద్రం పెండింగ్ బిల్లులు రూ.1845 కోట్లు విడుదల చేసిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా జోడించి, అవి పేదలకు ఇవ్వకుండా, ఆ డబ్బులు విడుదల చేయలేదని చంద్రబాబు పెర్కున్నారు. ఉపాధి హామీ నిధులు వేరే వాటికి ఉపయోగించకూడదు అనే నిబంధనలు ఉన్నా,ఆ నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, పెండింగ్ బిల్లులు చెల్లించకుండా వాటికి వేరే వాటికి దారి మళ్లించడం సరికాదని చంద్రబాబు అన్నారు.
కేంద్రం నిర్దేశించిన కార్యక్రమానికి నిధులు విడుదల చేసినప్పుడు...ఆ నిధుల స్వీకరణ తేదీ నుంచి మూడు రోజుల్లోగా రాష్ట్ర వాటాని ఉపాధి హామీ నిధికి జమ చేయాలి, అలా చేయని పక్షంలో తదుపరి నిధుల విడుదలను కేంద్రం నిలిపేస్తుందని స్పష్టమైన నిబంధనలున్నా ఏపీ సర్కారు పట్టించుకోవడంలేదని తెలిపారు. దీంతోపాటు రాష్ట్ర వాటా చెల్లింపు ఆలస్య కాలానికి 12 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది అదనపు భారం అవుతుంది అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉపాధి హామీ పథకం అమలు స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని చంద్రబాబు లేఖలో పెర్కున్నారు. వీటి పై అనేక కుటుంబాలు ఆధారపడినందున తక్షణమే బిల్లుల విడుదలకు చొరవ చూపాలని కేంద్ర మంత్రిని చంద్రబాబు కోరారు.