మెగా స్టార్ చిరంజీవి అంటే సినిమాల్లో మామూలు క్రేజ్ కాదు. అయితే ఆయన రాజకీయాల్లోకి రావటం, అక్కడ నుంచి ప్రజలు పిలుస్తున్నారు అంటూ ప్రజా రాజ్యం పార్టీ పెట్టటం, తరువాత సీట్లు అమ్ముకున్నారు అనే ఆరోపణలు, 18 సీట్లు మాత్రమే గెలవటం, తరువాత ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చెయ్యటం, తరువాత కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ టికెట్ తీసుకోవటం, ఆ తరువాత కేంద్ర మంత్రి అవ్వటం, పదవి పోగానే, 5 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో దూరంగా ఉండటం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, మొన్న ఎన్నికల్లో ప్రచారం చెయ్యలేదు. రాహుల్ గాంధీ స్వయంగా కోరినా, ఆయన మాత్రం సినిమాల్లో బిజీగ ఉన్నానని, ఈ సమయంలో మళ్ళీ రాజకీయాల్లో ఆక్టివ్ అవ్వలేనని చెప్పారు. అన్నట్టుగానే, మొన్నటి ఎన్నికల్లో ప్రచారానికి దూరం అయ్యారు.
అయితే ఎన్నికలు అయిన తరువాత నుంచి, బీజేపీ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం అవ్వటానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా, చిరంజీవిని తమ పార్టీలోకి తీసుకుని, పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి, కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. దీని పై అనేకసార్లు వార్తలు కూడా వచ్చాయి. చర్చలు జరిగాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, అటు చిరంజీవి కాని, ఇటు బీజేపీ కాని స్పందించలేదు. అయితే, తన సినిమా సైరా నరసింహారెడ్డి ప్రమోషన్ లో బిజీగా ఉన్న చిరంజీవి ఒక ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో తన పై వస్తున్న వార్తల గురించి స్పందించారు. అయితే ఆ వార్తలకు డైరెక్ట్ ఖండించలేదు. నేను వాళ్ళ పార్టీలో చేరాలని, పూర్తిగా వాళ్ల ఆలోచన, ఆశ. దానిపై నేనెలా స్పందిస్తాను. ప్రస్తుతానికి నా దృష్టంతా సినిమాలపైనే అంటూ స్పందించారు.
అయితే బీజేపీలో చేరిక వార్తలను మాత్రం ఖండించలేదు. అలాగే పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ ఓటమి పై కూడా చిరంజీవి తనదైన శైలిలో స్పందించారు. జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానంలో గెలవటం, పవన్ రెండు చోట్లా ఓడిపోవటం పై ప్రశ్నించగా, రాజకీయం అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ, ఈ సుదీర్ఘ ప్రయాణంలో, ఒకోసారి గెలుస్తాం, ఒకోసారి ఓడిపోతాం అని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక బలమైన లక్ష్యంతో రాజకీయం చెయ్యటానికి వచ్చారు, ఇప్పుడు ఆయన ఓడిపోవచ్చు కాని, భవిషత్తులో ఘన విజయం సాధిస్తారు. ఆయన ఆశయాలు చలా బలమైనవి, ఆయన ఆలోచనలకు క్రమంగా ప్రజల నుంచి మద్దతు లభిస్తుందనే నమ్మకం ఉందని చిరంజీవి అన్నారు.