అమరావతి పై మొదటి నుంచి అయిష్టంగా ఉన్న జగన మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా, అదే నైజంతో ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా, అమరావతి పై హేళన చేస్తూ, భ్రమరావతి అంటూ, గ్రాఫిక్స్ అంటూ హేళన చేసి, ఇప్పుడు అదే అమరావతిలో ఉన్న సచివాలయం నుంచి పరిపాలిస్తూ, అదే అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాలు కూడా పెట్టారు. అయితే ప్రతిపక్షంలో ఉండగా ఎన్నో చెప్తారని, జగన్ మోహన్ రెడ్డి అమరావతిని కొనసాగిస్తారాని అందరూ అనుకున్నారు. అమరావతికి రూపాయి పెట్టాల్సిన పని లేదు, లోన్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అది సిద్ధం అవ్వగానే, ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది కాబట్టి, అమరావతిని ఆపే ప్రయత్నం జగన్ చెయ్యరు అని అందరూ ఆశించారు. అయితే ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహారాలు జరుగుతున్నాయి. జగన్ అమరావతి పై ఏ మాత్రం ఆసక్తి చూపటం లేదు.
అమరావతికి లోన్ ఇచ్చే ప్రపంచ బ్యాంక్ వెనక్కు వెళ్ళిపోయింది. ఆషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వెనక్కు వెళ్ళిపోయింది. అమరావతి నిర్మాణం మొత్తం ఆగిపోయింది. ఎక్కడ పనులు అక్కడ నిలిచి పోయాయి. బొత్సా లాంటి వారు, ఇక్కడ రాజధానిగా ఉండటం కరెక్ట్ కాదని చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి. అమరావతిలో కాకుండా, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి చెప్పారు.కడప జిల్లా సచివాలయంలో ఇతర మంత్రులతో సమీక్ష జరిపి, విలేకరులతో మాట్లాడుతూ సీమలో హై కోర్ట్ పెట్టె ఆలోచన ఉందని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు.
అయితే కేవలం ఆఫీస్ లు మారిస్తే, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందా ? అనే ప్రశ్న వస్తుంది. దేశంలో ఎక్కడైనా, సచివాలయం, హైకోర్ట్, అసెంబ్లీ అనేవి, రాజధానిలో ఉంటాయి. అంటే ఇప్పుడు రాజధాని మార్పు విషమై, మంత్రి బుగ్గన సంకేతాలు ఇస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. సీమలో హైకోర్ట్ కావలని, అమరావతిలోనే ఉంచాలని లాయర్లు ఆందోళన చేస్తున్నారు. మరో పక్క, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నా, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకు, ఈ అంశం పై ఒక్క ముక్క కూడా మాట్లాడక పోవటంతో, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తమ భూముల పై, రుణాలు కూడా బ్యాంకులు ఇవ్వటం లేదని, ఇప్పుడు హైకోర్ట్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందని చెప్తున్నారని, ఇక అమరావతి రాజధానిగా ఉండదు అనే అభిప్రాయం కలుగుతుందని, ఆవేదన చెందుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి, ఇప్పటికైనా ఒక స్పష్టమైన ప్రకటన చెయ్యాలని కోరుతున్నారు.