జగన్ మోహన్ రెడ్డి పై అక్రమాస్తుల కేసులు ఉన్న సంగతి తెలిసిందే. 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు ఉన్నాయి. వీటి పై ప్రతి శుక్రవారం, హైదరాబాద్ లోని నాంపల్లి కోర్ట్ లో వాదనలు జరుగుతున్నాయి. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నంచి ఆయన కోర్ట్ కు వెళ్ళటం లేదు. ప్రతి వారం కోర్ట్ నుంచి మినహాయింపు అడుగుతున్నారు. ప్రతి వారం ఇలా మినహాయింపు కోరటం కష్టం కాబట్టి, తనకు ప్రతి వారం రాకుండా, అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పై ఈ రోజు వాదనలు జరిగాయి. అయితే ఈ రోజు జరిగిన వాదనల్లో, జగన్ పిటిషన్ పై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, జగన్ కి షాక్ ఇచ్చింది. మొన్నటి వరకు జగన్ కేసుల్లో చూసి చూడనట్టు ఉన్న సిబిఐ, ఈ సారి మాత్రం గట్టిగా పట్టుకుంది.
జగన్ పిటీషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేస్తూ, బలమైన వాదనలు వినిపించింది. జగన్ మోహన్ రెడ్డి వాస్తవాలు దాచిపెట్టి కోర్టుకు వచ్చారని కౌంటర్లో సీబీఐ తెలిపింది. జగన్ ఎంపీగా ఉన్న సమయంలో సాక్ష్యాలను తారుమారు చేస్తారనే అప్పట్లో ఆయనను అరెస్టు చేశామని సీబీఐ చెప్పింది. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే, ఆయన కుమారుడిగా ఉన్నప్పుడే జగన్ పై అక్రమ లావాదేవీల అభియోగాలు ఉన్నాయని, కోర్ట్ కి సమర్పించిన కౌంటర్లో సిబిఐ వివరించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడే తన బలాన్ని ఉపయోగించి, సాక్షులను ప్రభావితం చేశారని, ఇప్పుడు ఒక ప్రభుత్వానికి అధినేతా సాక్షులను ప్రభావితం చేసేందుకు ఇప్పుడు మరింత ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సీబీఐ పేర్కొంది.
మరో పక్క తాను రావటానికి, ఎక్కువ ఖర్చు అవుతుందని, ప్రభుత్వం పై భారం పడుతుంది అంటూ జగన్ చెప్పిన వాదనని ప్రస్తావిస్తూ, ఆయన పేర్కొన్న రాష్ట్ర పునర్విభజన, గత ప్రభుత్వ పనితీరుకు, ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ తెలిపింది. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక, రెవెన్యూ అంశాల ప్రస్తావన ద్వారా, ఈ కేసుకు సంబందించిన వాస్తవాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సిబిఐ ఆరోపించింది. ఆర్థిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపే అభియోగాలు జగన్ పై ఉన్నాయని, సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని, సీబీఐ కౌంటర్లో ప్రస్తావించింది. అసలు రాష్ట్ర రెవెన్యూ లోటనేది, ఒక కేసులో ఉన్న వ్యక్తి, వ్యక్తిగత హాజరుకు మినహాయింపునిచ్చే కారణం కాదని పేర్కొంది. విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడం పెద్ద కష్టం ఏమి కాదని, ఇది సరైన కారణం కాదని అభిప్రాయపడింది. సీఎంగా ఆయనకు ఉన్న సౌకర్యాలతో 275 కి.మీ.ప్రయాణించడం కష్టమేమీ కాదని కౌంటర్లో సీబీఐ పేర్కొంది. జగన్ కు మినహాయింపు ఇవ్వద్దు అంటూ కోర్ట్ ని కోరింది, సిబిఐ.