జగన్ మోహన్ రెడ్డి పై, నిన్న సిబిఐ కోర్ట్ లో, సిబిఐ వేసిన పిటీషన్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ పిటీషన్ లో సిబిఐ పేర్కున్న అంశాల పై జగన్ సమాధానం చెప్పాలని అన్నారు. ఇలాంటి వ్యక్తి మన సియం అయినందుకు సిగ్గు పడాలని అన్నారు. సిబిఐ నిన్ను ఒక అవినీతి చక్రవర్తి అంటుంటే, మీరు మాత్రం అవినీతిని అంతం చెయ్యటానికి, దేవుడు నన్ను పంపించాడు అని చెప్పటం సిగ్గు చేటు అని చంద్రబాబు అన్నారు. "జగన్ జైల్లో ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేసినందున, ముఖ్యమంత్రిగా మరింతగా సాక్షులను ప్రభావితం చేయగలరని సీబీఐ చేసిన వ్యాఖ్యల పై జగన్ సమాధానం చెప్పాలి. అవినీతి నియంత్రణకు తనను దేవుడు పంపాడని ఆయన చెప్పడం సిగ్గుచేటు. సీబీఐ కేసుల్లో నిండా మునిగిన ఆయన నీతులు చెప్పడం విడ్డూరం. అవినీతి ఆస్తుల్ని ప్రభుత్వానికి అప్పగించి నిజాయతీ పాటిస్తే.. అప్పుడు జగన్‌ను నేనూ అభినందిస్తా’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో అన్ని జిల్లాలకు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీరాజ్ ఛాంబర్ల రాష్ట్ర అధ్యక్షులతో నిన్న రాత్ర గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఇదే సందర్భంలో, జగన్ సిబిఐ కోర్ట్ కు వారం వారం రాకుండా, తనకు మినహాయింపు ఇవ్వాలి అంటూ, సిబిఐ కోర్ట్ లో వేసిన పిటీషన్ పై, సిబిఐ వినిపించిన వాదనలు, వార్తాల్లో రావటంతో, చంద్రబాబు ఆ విషయం ప్రస్తావించారు. సిబిఐ, జగన్ పై చేసిన తీవ్ర వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చట్టం ముందు, ఒక సియం అయినా, సామాన్యుడు అయినా ఒక్కటే అనే విధంగా, సిబిఐ వాదనలు చేసింది. కోర్ట్ విచారణ నుంచి మినహయింపు కోరుతూ, జగన్ వేసిన పిటీషన్ ను కొట్టేయాలని కోర్ట్ ని కోరింది.
చట్టం ముందు ప్రతి పౌరుడు సమానమేనని, అధికారంలో ఉన్నంత మాత్రాన, కోర్ట్ విచారణ నుంచి వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరటం, రాజ్యాంగంలోని 14వ అధికరణకు విరుద్ధమని సిబిఐ కోర్ట్ కు తెలిపింది. జగన్ జైల్లో ఉన్న సమయంలోనే, తన పలుకుబడిని, ఉపయోగించి సాక్ష్యాలను ప్రభావితం చేసారని, ఇప్పుడు సీఎం హోదాలో, అన్ని అధికారాలూ ఆయనకు ఉన్నాయని తెలిపింది. నిందితుల హోదా, ఆర్థిక నేపథ్యం ఆధారంగా వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వకూడదని, ఇలా చేస్తే, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని కోర్ట్ కు చెప్పింది. అధికారాన్ని ఉపయోగించి, సాక్షులు భయాందోళనకు గురయ్యే అవకాశముందని తెలిపింది. అందుకే జగన్ కు కోర్ట్ నుంచి మినహాయింపు ఇవ్వ కూడదు అని తెలిపింది.