టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారుతూ ఉంటుంది. ఇక రాజకీయాల్లో అయితే, రోజు రోజుకీ మారి పోతూ ఉంటుంది. ఇప్పుడు బీజేపీ, వైసిపీ మధ్య అదే జరుగుతుందా అనే సందేహం కలుగుతుంది. మొన్నటి దాకా ఇద్దరూ లోపాయకారీ ఒప్పందంతో పని చేసారు. ఎలా అయినా చంద్రబాబుని దింపాలి అనే ఉద్దేశంతో, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కలిసి, వివిధ రకాలుగా రాజకీయం నడిపి, చంద్రబాబు దిగిపోవటానికి, అన్ని విధాలుగా సహకరించుకుని, మొత్తానికి జగన్ ను ఎక్కించారు. అయితే మొదట నెల రోజులు అంతా సాఫీగా సాగిపోయినా, తరువాత నుంచి మాత్రం, జగన్ కు బ్రేక్ లు ఇస్తూ వస్తున్నారు. చిన్న చిన్న పనులు కూడా చెయ్యటం లేదు. కనీసం స్టీఫన్ రవీంద్ర, శ్రీలక్ష్మీ లాంటి వారిని, పక్క రాష్ట్రం నుంచి డిప్యుటేషన్ పై తెచ్చుకుంటానికి కూడా కేంద్రం ఒప్పుకోలేదు. ఇక నిధులు సంగతి అయితే సరే సరి. విభజన హామీల ఊసే లేదు.
పోలవరంలో జగన్ ప్రభుత్వ వైఖరిని తప్పు బడుతూ, పార్లమెంట్ లోనే ప్రకటన చేసారు. ఇక విద్యుత్ పీపీఏ ల విషయంలో అయితే, ఒక అడుగు ముందుకు వేసి, జగన్ తప్పుడు సమాచారం చెప్తూ, తప్పుదోవ పట్టిస్తున్నారని, ఏకంగా కేంద్ర మంత్రి మీడియా ముందు చెప్పారు. అయితే, ఢిల్లీలో లాబీయింగ్ లో బిజీగా ఉండే విజయసాయి రెడ్డి, పప్పులు కూడా ఇప్పుడు అక్కడ ఉడకటం లేదని సమాచారం. మొన్నా మధ్య, మేము చేసే ప్రతి పనికి, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని చెప్పిన దగ్గర నుంచి, విజయసాయి రెడ్డిని, ఢిల్లీ వర్గాలు దూరం పెట్టాయని తెలుస్తుంది. అయితే, ఇప్పుడు సిబిఐ నుంచి, జగన్ మోహన్ రెడ్డికి అదిరిపోయే జర్క్ వచ్చింది. కోర్ట్ విచారాణ నుంచి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ, జగన్ వేసిన పిటీషన్ పై, సిబిఐ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
జగన్ మోహన్ రెడ్డి సియం హోదాలో ఉన్నారని కూడా చూడకుండా, సిబిఐ, కోర్ట్ లో బలమైన వాదనలు వినిపించింది. జగన్ మోహన్ రెడ్డి ఆర్ధిక నేరాల పై సుప్రీం కోర్ట్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూడా తమ వాదనల్లో వినిపించారు. అంతే కాదు, జగన్ మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడే సాక్ష్యులను బెదిరించారని, ఇపుడు సియంగా ఉంటూ, ఏదైనా చేస్తారని, ఘాటుగా వాదనలు వినిపించారు. అయితే అంతా బాగుంది అనుకున్న టైంలో, సిబిఐ, ఇలా రివర్స్ అవ్వటం పై, వైసిపీ పార్టీలో గుబులు మొదలైంది. అమిత్ షా నుంచి వచ్చిన ఇన్ డైరెక్ట్ వార్నింగా అంటూ, గుసగుసలాడు కుంటున్నారు. సిబిఐ ఉన్నట్టు ఉండి స్పీడ్ పెంచటం పై, వైసిపీలో అంతర్మధనం మొదలైంది. ఒక వేళ కోర్ట్ కనుక, ప్రతి శుక్రవారం విచారణకు రావాలి అని అంటే, అంతకంటే అప్రతిష్ట ఏమి ఉండదని, గుబులు పడుతున్నారు. మరి, ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.