వైఎస్ జగన్ కు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత, జగన్ కు ఇది మూడో లేఖ. గత నాలుగు నెలలుగా, ఉపాధి హామీ పనుల పై ప్రభుత్వం, పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, పేదల జీవనోపాధిని దెబ్బతీస్తోందని లేఖలో పెర్కున్నారు. ఇవి లేఖలోని ముఖ్యాంశాలు. " ఏ ప్రాంతంలో అయినా, కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు, గత అభివృద్ధి కార్యక్రమాల వేగం తగ్గకుండా ముందుకు తీసుకుపోవడంతో పాటుగా, కొత్తగా మరింత సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం ఇప్పటిదాకా చూశాం. కానీ గడిచిన 4నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశవ్యాప్తంగా ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తున్నాయి. రద్దుల పద్దులు, కూల్చివేతలు, నిలిపివేతలే త్రిసూత్ర పథకంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. ఆ జాబితాలోకి అత్యంత ప్రతిష్టాత్మక పథకం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) కూడా చేరడం అత్యంత ఆందోళనకరం. నరేగా పనుల పట్ల ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం లక్షలాది పేద కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీస్తోంది."
"రాష్ట్రవిభజన వల్ల 2014-15లో తలెత్తిన తీవ్ర ఆర్ధిక లోటు అధిగమించడం అత్యంత క్లిష్టంగా మారిన నేపథ్యంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) ఏపిలోని 13 జిల్లాలలో గ్రామీణాభివృద్ధికి ఎంతో ప్రయోజనకారి అయ్యింది. గత ఏడాది రూ.9,300కోట్లతో నరేగా పనులు చేయడం దేశంలోనే ఒక రికార్డు. గడిచిన 5ఏళ్లలో నరేగా నిధులు రూ.32వేలకోట్ల పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వినియోగించుకోగలిగింది అంటే దానివెనుక ఎంతో నిర్మాణాత్మక కృషి, దూరదృష్టి, కార్యాచరణతో సాధించాం. అలాంటి స్థితినుంచి ప్రస్తుత సంక్షోభంలోకి, 'నరేగా' పనులు నెట్టబడటం బాధాకరం, భవిష్యత్ గ్రామీణాభివృద్దికే తీవ్ర విఘాతం. ఇటు పేదల ఉపాధికి, అటు అభివృద్ధికి గణనీయంగా ఉపయోగపడిన నరేగా పథకాన్ని గత 4 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కేంద్రం ఈ పథకానికి విడుదల చేసిన నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను కలిపి విడుదల చేయకుండా ఆ మొత్తాన్ని వేరే పనులకు దారి మళ్ళించారు. పాలకుల చేతకానితనం కారణంగా, ప్రతిష్టాత్మకమైన నరేగా పథకం నిర్వహణ నీరుగారిపోతోంది, అంతేకాకుండా పథకం ప్రాథమిక లక్ష్యాన్నే దెబ్బతీస్తోంది."
"2019-20 సంవత్సరానికి రాష్ట్రంలో నరేగా పనులకు కేంద్రం నిధులు విడుదల చేస్తూ కేంద్ర గ్రామీణాభివద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ 3 జీవోలు ఇచ్చారు. 05.08.2019న రూ.836,00,68,000 మరియు 08.07.2019న రూ.641,39,52,000 మరియు 09.04.2019న రూ.367,65,41,000... మొత్తం రూ.1,845 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రం తన వాటా నిధులతో పాటు ఈ నిధులను స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ ఫండ్‌కు, కేంద్రం నిధులు విడుదల చేసిన 3 రోజుల్లోపు విడుదల చేయాలని స్పష్టంగా ఆదేశించింది. లేనిపక్షంలో భవిష్యత్తులో నరేగాకు ఇచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్‌కు ఆపేస్తామని హెచ్చరించింది. రాష్ట్రం ఎన్నాళ్లు నిధులు విడుదల చేయకుండా ఆపితే అంత కాలానికి 12% వడ్డీతో సహా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని హెచ్చరించింది. కూలీలకు సకాలంలో వేతనాల చెల్లింపులు లేవు. క్షేత్రస్థాయి సహాయకుల్లో అభద్రతతో రాష్ట్రంలో ఈ పథకం మనుగడే ప్రశ్నార్ధకం అయ్యింది. చెల్లింపులు జరపలేదు కాబట్టి పనులు చేపట్టలేమని అటవీశాఖే బాహాటంగా ప్రకటించింది. ఇప్పటికైనా మీరు తక్షణమే స్పందించి, కేంద్రం విడుదల చేసిన నిధులతోపాటు రాష్ట్ర వాటా నిధులు కలిపి సత్వరమే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను ప్రాధాన్యతా క్రమంలో చెల్లించాలని, నరేగా పనులు కుంటుపడకుండా చూడాలని, కోట్లాది కూలీల జీవనోపాధికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం."