స్పీకర్ స్థానం అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ, ఎన్నో మాటలు చెప్పిన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం, ఆయన బయట మాత్రం, తన మాటలకు విరుద్ధం వ్యవహరిస్తున్నారు. నలుగురు టిడిపి రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం అయితే, వారి పై అనర్హత వేటు వెయ్యలేదు అంటూ వెంకయ్య నాయుడు వైఖరినే తప్పుబట్టిన తమ్మినేని, ఆయన విషయం వచ్చే సరికి మాత్రం, ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మొన్నటి మొన్న గ్రామ వాలంటీర్లతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను కౌన్ కిస్కా గొట్టం గాళ్ళు అంటూ తీవ్ర విమర్శలు చేసారు. ఒక స్పీకర్ స్థానంలో ఉంటూ, ఇలా ఒక పార్టీకి కొమ్ముకాస్తూ, ఉండటం పై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. గ్రామ వాలంటీర్లు అనే వ్యవస్థ పార్టీ వ్యవస్థలాగా మాట్లాడటం కూడా విమర్శలకు తావుచ్చింది.
అయితే ఇప్పుడు మరోసారి తమ్మినేని ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. ఈసారి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు టార్గెట్ గా రాజకీయ విమర్శలు చేసారు. సహజంగా స్పీకర్ స్థానంలో ఉంటూ, ప్రతిపక్ష నాయకుడి పై రాజకీయ విమర్శలు చెయ్యరు. గతంలో కోడెల ఇలా చేసరాని, అందుకే మేము వ్యవస్థను మార్చేస్తున్నాం అని చెప్తున్న జగన్ గారు, ఈ వైఖరి పై ఏమి చెప్తారో మరి. ఈ రోజు శ్రీకాకుళంలో, పలాసలో జగన్ మోహన్ రెడ్డి సభలో తమ్మినేని పాల్గున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వంద రోజుల పాలనలో జగన్ మోహన్ రెడ్డి అద్భుతంగా చేసారని, రాజకీయాల్లో ఇలాంటి ముఖ్యమంత్రి భారత రాజకీయ చరిత్రలో ఒక్క జగన్ మాత్రమేనని కితాబిచ్చారు.
జగన్ మోహన్ రెడ్డి రాకతో పలాస ప్రాంతం పునీతమైందని వ్యాఖ్యానించారు. పలాస ప్రజలు వెనుకబడిన తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, జగన్ తనను ఏకంగా శాసన సభాపతిగా చేశారని హర్షం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి పై పొగడ్తలు అయిన తరువాత, చంద్రబాబుని టార్గెట్ చేసారు. చంద్రబాబు-కరువు కవల పిల్లలు అంటూ, స్పీకర్ గా ఉంటూ, ప్రతిపక్ష నాయకుడికి పై రాజకీయ విమర్శలు చేసారు. జైహింద్.. జై జగన్’ అంటూ తమ్మినేని తన ప్రసంగాన్ని ముగించారు. అయితే ఒక పక్క సీమలో, ఉత్తరంద్రలో తాగు నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే, స్పీకర్ గారు మాత్రం, చంద్రబాబుని విమర్శిస్తున్నారు. అలాగే జూన్, జూలై నెలలో వర్షాలు లేక, ఖరీఫ్ లేట్ అయిన సంగతి తెలిసిందే. ఆగష్టు నెలలో కూడా, మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు పడి, మనకు వరదలు వచ్చాయి. మరి జగన్ మోహన్ రెడ్డి గారు, ఎవరితో కవలు పిల్లలో ? ఏది ఏమైనా, రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్న వారు, రాజకీయ విమర్శలు చెయ్యకుండా ఉంటే, ఆ స్థానానికి గౌరవం వస్తుంది.