నవయుగ కంపెనీ పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టిందా అన్న రీతిలో, ప్రస్తుతం వ్యవహారాలు నడుస్తున్నయి. పోలవరం ప్రాజెక్ట్ లో, 73 శాతం పనులు కావటనికి ఎంతో కృషి చేసిన నవయుగ కంపెనీని పోలవరం ప్రాజెక్ట్ పనులు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఏరియాలో నిర్మించే పోలవరం హైడల్ ప్రాజెక్ట్ నుంచి కూడా నవయుగని తప్పించారు. అయితే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో, ట్రాన్స్ ట్రాయ్ నుంచి సబ్ కాంట్రాక్టు కావటంతో, నవయుగ కంపెనీ, కేవలం పోలవరం హైడల్ ప్రాజెక్ట్ మీదే కోర్ట్ కు వెళ్ళింది. అయితే వెంటనే హైకోర్ట్, ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం మాత్రం తీవ్రంగా స్పందించింది. 73 శాతం పనులతో పరుగులు పెట్టించిన నవయుగ కంపెనీని తప్పించమని ఎవరు చెప్పారు అంటూ, రాష్ట్ర ప్రభుత్వం పై ఫైర్ అయ్యింది.
ఇది ఇలా నడుస్తూ ఉండగానే, నిన్న ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో, నవయుగ కంపెనీకి బందర్ పోర్ట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన జీవో 66ను ‘నవయుగ మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్’ కంపెనీ హైకోర్టులో సవాల్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించిన వెంటనే, కోర్ట్ లో కేసు వేసింది. మమ్మల్ని కనీసం వివరణ అడగకుండా ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్ట్ కు చెప్పింది. నిన్న క్యాబినెట్ నిర్ణయం పైనే కాకుండా, ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఆగస్టు 8న ఏపి ప్రభుత్వం జారీచేసిన జీవో 66ను సస్పెండ్ చెయ్యాలని కోరింది.
ఏపి ప్రభుత్వం బందర్ పోర్ట్ విషయంలో, తరువాత చర్యలు ఏమి తీసుకోకుండా, బందర్ పోర్ట్ పనులు మరే కంపెనీకు ఇవ్వకుండా చూడాలని, నవయుగ సంస్థ తరఫున డైరెక్టర్ వై.రమేశ్ బుధవారం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. "మచిలీపట్నం పోర్టు పనుల కోసం భూములను ఎలాంటి అడ్డంకుల్లేకుండా అప్పగించడంలో ప్రభుత్వం విఫలమైంది. కొంత భూమి ఆక్రమణలో ఉంది. సౌకర్యాలు కల్పించినా నిర్మాణం పూర్తి చేసే ఉద్దేశం మాకు లేదని పేర్కొనడంలో వాస్తవం లేదు.5324 ఎకరాల్లో మాకు అప్పగించిన 412 ఎకరాలు పోగా.. 4912 ఎకరాల్ని త్వరితగతిన అప్పగించాలని కోరాం. ఈ బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నిబంధనలకు విరుద్ధంగా, అకస్మాత్తుగా ఒప్పందాన్ని రద్దు చేశారు. వివిధ పనుల కోసం రూ.436 కోట్లకు పైగా ఖర్చు చేశాం. ఈ అంశాల్ని పరిగణించి, జీవో 66ను రద్దు చేయండి" అంటూ పిటీషన్ లో కోరింది నవయుగ.