ఆంధ్రప్రదేశ్, తెలంగాణా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో, చంద్రబాబు, జగన, కేసిఆర్ అంతటి ఇమేజ్ ఉన్న మాజీ గవర్నర్ నరసింహన్, ఆయన పదవి నుంచి నిన్న బదిలీ అయిన సంగతి తెలిసిందే. నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా తిప్పిస్తే, నిన్న తెలంగాణా గవర్నర్ పదవి నుంచి కూడా కేంద్రం ఆయన్ను తప్పించింది. ఆయన స్థానంలో, తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళసై సౌందర రాజన్‌ను నియమిస్తూ, కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే సమయంలో, నరసింహన్ కు మాత్రం, ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన మోడీ, అమిత్ షాకు చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి, ఆయనకు ఎక్కడో ఒక చోట పోస్టింగ్ ఇస్తారని అందరూ భావించారు. అయితే మోడీ, షా మాత్రం, నరసింహన్ కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. తెలంగాణాతో పాటు, అయిదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వచ్చారు. దీంతో ఇక నరసింహన్ కు, ఏ విధమైన పోస్టింగ్ రాదనే విషయం స్పష్టం అయిపొయింది.
అయితే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం, నరసింహన్ ను విడిచి పెట్టటానికి ఇష్ట పడటం లేదు. నరసింహన్ సేవలు ఎలా అయినా ఉపయోగించుకోవాలని యోచిస్తున్న కేసిఆర్, నరసింహన్ ను, తెలంగాణా రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకుని, ఆయనని, తన దగ్గరే ఉంచుకోవాలని నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. నరసింహన్ కు, దాదపుగా 10 ఏళ్ళకు పైగా అనుబంధం ఉంది. తెలంగాణా రాష్ట్రంలో ఎవరు ఏంటో మొత్తం తెలుసు. రాజకీయంగా కూడా నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం ఉంది. అన్నిటికీ మించి, కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. అందుకే నరసింహన్ ను, తెలంగాణా ప్రభుత్వ సలహాదారుడిగా చేసి, ఆయన సేవలు వినియోగించుకోవాలనే ఆలోచనలో కేసిఆర్ ఉన్నట్టు తెలుస్తుంది.
గవర్నర్ మార్పు వార్తలు తెలియగానే, ఆదివారం సాయంత్రం కేసీఆర్, నరసింహన్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఇంతకాలం రాష్ట్రానికి సేవలు అందించినందుకు అభినందించారు. తరువాత ఆయన మనసులో మాట, నరసింహన్ కు చెప్పినట్టు సమాచారం. దీని పై నరసింహన్ ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో చూడాల్సి ఉంది. నరసింహన్ తెలంగాణా ఉద్యమ సమయంలో కూడా కేసిఆర్ కు అనుకూలంగా వ్యవహరించే వారు. దానికి తగ్గట్టుగానే అప్పట్లో సోనియా గాంధీకి రిపోర్ట్ లు ఇచ్చే వారు. తరువాత మోడీతో కూడా, సన్నిహితంగా ఉంటూ, కేసీఆర్ పై పాజిటివ్ రిపోర్ట్ లు ఇచ్చే వారు. అదే సమయంలో చంద్రబాబు పై నెగటివ్ రిపోర్ట్ లు ఇచ్చేవారని, అనేకసార్లు టిడిపి కూడా ఆరోపించింది. ఇంతటి సన్నిహితంగా ఉన్న నరసింహన్ ను, కేసీఆర్ వదులుకోవటానికి సిద్ధంగా లేరని, అందుకే ఆయనకు ప్రభుత్వంలో ఏదో ఒక పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతుంది.