ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై రగడ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు జగన్ మొహన్ రెడ్డి సమీక్ష జరిపినా, క్లారిటీ వస్తుంది అనుకున్న వారికి నిరాశే మిగిలింది. జగన్ సమీక్ష తరువాత, బొత్సా మీడియాతో మాట్లాడుతూ, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. అలాగే సుజనా చౌదరి వందల ఎకరాలు భూమిని కొట్టేసారని, బ్యాంకులను మోసం చేసి ఎదిగారని, రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా లాభం పొందారని బొత్స అన్నారు. మరో పక్క విజయసాయిరెడ్డి కూడా, సుజనాని టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. బొత్సా, విజయసాయి రెడ్డి హద్దు మీరి ఆరోపణలు చేస్తున్నారని, సుజనా ఈ రోజు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో, మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. బొత్సా, విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో ఖండించారు. బొత్సా చెప్పినట్టు, తమకు 2013 తరువాత, ఒక్క సెంట్ భూమి కూడా రాజధాని ఏరియాలో లేదని అన్నారు.
2013 తరువాత, కృష్ణా, గుంటూరు జిల్లాలో, తాను కాని, తమ కుటుంబం కానీ, సెంట్ భూమి కూడా ఇక్కడ కొనలేదని అన్నారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేసి, ఉన్న సమస్యల నుంచి, ప్రజలను డైవర్ట్ చెయ్యకుండా, మంచి పరిపాలన అందించాలని సుజనా అన్నారు. ఒక వేళ నేను కనుక ఇన్సైడర్ ట్రేడింగ్ చేసాననే ఆధారాలు మీ దగ్గర ఉంటే, కేసులు పెట్టుకుని, తనని అరెస్ట్ చెయ్యండి అంటూ సుజనా, బొత్సాకి ఛాలెంజ్ చేసారు. అలాగే విజయసాయి రెడ్డి నాసిరకం ట్వీట్ల పై సుజనా ఘాటుగా స్పందిన్కాహారు. విజయసాయిరెడ్డికి ఓ స్థాయి ఉందని ఇన్నాళ్లూ అనుకున్నానని, కాని ఆయన ఇంతగా దిగజారిపోయి ట్వీట్లు వేస్తాడని అనుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయాల్లో ఉన్న ఇన్ని ఏళ్ళలో ఎన్నో ఆరోపణలు చూశానని, అయితే, ఇంత నాసిరకం ఆరోపణలు విజయసాయి రెడ్డి దగ్గరే చూస్తున్నానని అన్నారు.
వాళ్లలా నేనేమీ జైలుకు వెళ్లలేదని విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి నా పై వేసే, నాసిరకం ట్వీట్లకు ఇక పై స్పందించనని, తన లాగా నేను ఇక దిగజారలేనని, వాటికి ముగింపు పలుకుదామని అనుకుంటున్నానని, ఆ స్థాయికి దిగజారడం అనవసరమని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. విజయసాయిరెడ్డి సన్నాసి సలహాలు వినబట్టే, జగన్ మోహన్ రెడ్డి, ఈ రోజు పరిపాలనలో ఇన్ని కష్టాలు ఎదుర్కుంటున్నారని సుజనా అన్నారు. ఈయన సలహాలు వింటే జగన్ మునగటం కాదు, రాష్ట్రం మునుగుతుందని సుజనా అన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసిన వ్యక్తులు, సంస్థలపైనా పరువు నష్టం దావా వేస్తానని సుజనా అన్నారు. తాను తప్పు చేశాను అనుకుంటే, కేసులు పెట్టుకుని, అరెస్ట్ చేసుకోండి అంటూ జగన్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు సుజనా..