జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది. అక్కడ ప్రధానిని కలసినా, అమిత్ షాని కలిసి ఒప్పించటానికి చూసినా, జగన్ పప్పులు ఉడకటం లేదు. కేంద్రం మాత్రం తగ్గటం లేదు. మీ విధానాల వల్ల, దేశానికి నష్టం అంటూ, జగన్ ప్రభుత్వ వాదనతో ఏకీభావించటం లేదు. ఇదే విషయాన్ని కేంద్రం అధికారికంగా హైకోర్ట్ కు కూడా చెప్పింది. విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో, 42కు పైగా విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలు హైకోర్ట్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా, విద్యుత్ ఉత్పత్తి సంస్థల తరఫున న్యాయవాదులు, పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించే అధికారం, రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, మరోసారి హైకోర్టులో పునరుద్ఘాటించారు. ఒప్పందం చేసుకున్న సమయంలో, ఇలాంటి క్లాజ్ ఏమి లేదని, ఎప్పుడో కుదుర్చుకున్న ఒప్పందాల ఇప్పుడు సమీక్షించి, రేటు తగ్గించమనటం కుదరదని అన్నారు.
ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి, అన్నీ ఆలోచించి, వినియోగదారుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని, రేటును నిర్ణయించిందని, 2014లో నిర్ణయించిన రేటును 2019లో తగ్గించాలనడం కేంద్ర విద్యుత్ చట్ట నిబంధనలకు విరుద్ధమని విద్యుత్ సంస్థల తరఫున న్యాయవాదులు వాదించారు. ఇదే సందర్భంలో కేంద్రప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) బి. కృష్ణమోహన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, ఏదైనా అవినీతి జరిగిందని, స్పష్టమైన ఆదేశాలు ఉంటేనే, ఆ ఒప్పందాలని రద్దు చేసుకునే అవకాసం ఉంటుందని పేర్కొన్నారు. ఒప్పందం చేసుకున్న టైంలో పునః సమీక్ష క్లాజ్ ఉంటేనే, వీటిపై మళ్లీ చర్చకు వీలుంటుందని చెప్పారు.
అంతే కాని ఇష్టం వచ్చినట్టు ఒప్పందాలు ఉల్లంఘించడానికి కుదరదని, ఒప్పందంలో స్పష్టంగా రాసుకుంటే తప్ప, వాటిపై పునః సమీక్షలు కుదరవని కేంద్ర ఇంధన వనరులశాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరుపున సొలిసిటర్ జనరల్ ప్రస్తావించారు. విద్యుత్ కంపెనీల తరఫున మరికొంతమంది న్యాయవాదులు వాదనలు వినిపించాల్సి ఉండటంతో హైకోర్ట్ న్యాయమూర్తి విచారణను గురువారానికి వాయిదా వేశారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి అనేక ఎదురు దెబ్బలు తగిలాయి. అటు కేంద్రంతో పాటు, ఇటు విదేశీ ప్రభుత్వాలు కూడా జగన్ ప్రభుత్వ వైఖరిని తప్పు బట్టాయి. జపాన్ ప్రభుత్వం ఈ విషయంలో వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.