తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు దిగజారి పోతున్నాయి. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు అలాగే తయారయ్యాయి. 2004 వరకు లేని సంస్కృతీ, రాజశేఖర్ రెడ్డి సియం అయిన తరువాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైంది. అదే రాజకీయ ఫిరాయింపులు. పదవుల్లో ఉంటూనే, ఒక పార్టీ గుర్తు మీద గెలిచి, ఇంకో పార్టీలోకి జంప్ కొట్టటం. అప్పట్లో ప్రతిపక్షాలను బలహీన పరచటానికి, వైఎస్ఆర్ ఇది బాగా ఉపయోగించారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీని ముప్పు తిప్పలు పెట్టారు. తరువాత 2009లో టిడిపి ని టార్గెట్ చేసారు. టిడిపి ఎంపీలుగా ఉన్న, ఆదికేశవులు, మందా జగనన్నాదంను తన పార్టీలోకి చేర్చుకోవటం, అప్పట్లో సంచలనం అయ్యింది. రాజశేఖర్ రెడ్డి వేసిన ఈ బీజం, ఇప్పుడు వికృత రూపం దాల్చింది. 2014లో కేసిఆర్ అధికారంలోకి రాగానే, టిడిపి ఎమ్మెల్యేలను లాక్కుని, వారికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇక 2016లో చంద్రబాబు ఇదే పని చేసారు.
అప్పటి వరకు ఈ ఫిరాయింపులకు బాదితులగా ఉన్న టిడిపి కూడా, ఇది మొదలు పెట్టే సరికి, రాజకీయాలు అంటే ప్రజలకు అసహ్యం పుట్టింది. నిజానికి, జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ ఆఫీస్ ముందు నుంచి, నీ ప్రభుత్వాన్ని గంటలో పడగొడతా, నా దగ్గర నీ మనుషులు 21 మంది ఉన్నారు అని అంటేనే, చంద్రబాబు అటు వైపు నుంచి లాగారు. కాని, ఏది చేసినా తప్పు తప్పే, దానికి మొన్న ఎన్నికల్లో దెబ్బ కూడా పడింది. అయితే ఇప్పడు, జగన్ అధికారంలోకి రావటంతో, ఇప్పుడు టిడిపి నుంచి అటు వెళ్తున్నారు. మొన్నటి దాక జగన్ ను బూతులు తిట్టిన జూపూడి, ఇప్పుడు జగన్ చేత కండువా కప్పించుకున్నారు. అధికారం లేకుండా, నాలుగు నెలలు కూడా ఉండలేని ఇలాంటి వారికి బుద్ధి చెప్తూ, నిన్న టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుచేసిన ఘాటైన వ్యాఖ్యలు, సంచలనంగా మారాయి. అయ్యన్న వ్యాఖ్యల పై, పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుంది.
ఇది పార్టీ మారే వారి పట్ల, అయ్యన్న చేసిన వ్యాఖ్యలు... "నాకు పార్టీ పదవులు ఇచ్చింది, ప్రజలు సమాజంలో నన్ను ఇంత స్థాయికి తీసుకుని వెళ్ళారు... నేను పోయినా కూడా ఒకే జెండా కప్పుకుని పోతా తప్పా... నాలుగు జెండాలు కలిపికుట్టుకుని పైన కప్పించుకొను.... నేను దమ్ముతో ఒకే స్థానం నుంచి పోటీ చేశాను.. ఒకే పార్టీలో ఉన్నాను...ఎందుకంటే నీతి, నిజాయితీ, నమ్మకం ఉన్నాయి కాబట్టి... పార్టీ పదవులు ఇచ్చినా కూడా వదిలి వెళ్లిపోయే అవకాశ వాదులు ఏ పార్టీకైనా చెద పురుగులే... అలాంటి నీతిలేని ద్రోహులను తరిమికొట్టినప్పుడే రాజకీయాలకు పట్టిన మకిలి వదులుతుంది... MLA, MP, Ministers, Chairman etc ఇచ్చింది కదా పార్టీ..ఇప్పుడు తల్లి కష్టాలలో ఉందని ఒదిలిపోయే పిరికి పిందెలు మాకు అవసరం లేదు... మా వెనుక ప్రజలు ఉన్నారు..." అని అయ్యన్న పాత్రుడు అన్నారు. అయితే ఇలా నిబద్ధతత ఉన్న నాయకులను గెలిపించకుండా, ప్రజలు మాత్రం, పార్టీలు మారే వారినే గెలిపిస్తూ ఉండటం, గమనార్హం. మారాల్సింది, ప్రజలా, రాజకీయ నాయకులా అనే ప్రశ్న కూడా వస్తుంది.