ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన పనితో, ఆంధ్రప్రదేశ్ పరువు జాతీయ స్థాయిలో పోయింది. జాతీయ మీడియాలో కధనాలు రావటంతో, ఏపి పోలీసుల చేత ప్రభుత్వం, చేపించిన పని చూసి, జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఏఎన్ఐ, బిజెనెస్ స్టాండర్డ్ లాంటి పత్రికల్లో కూడా, ఈ విషయం ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక విషయానికి వస్తే, ఆటోలు ఉన్న వారికి, వాహన మిత్ర పధకం కింద, ఏడాదికి 10 వేలు ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు కూడా. అయితే లబ్దిదారుల విషయంలో భారీగా కోత పడింది అనే విమర్శలు వచ్చాయి. 6 లక్షల మందికి పైగా ఆటోలు ఉన్నవారు ఉంటే, అనేక నిబంధనలు సాకుగా చూపి, కేవలం లక్షకు పైగా మాత్రమే ఈ పధకం అమలు చెయ్యటం పై విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలు ఎన్ని ప్రశ్నించినా, ప్రభుత్వం మాత్రం వీటికి సమాధానం చెప్పకుండా, ప్రచారం మాత్రం ఘనంగా చేసుకుంటుంది.
ఈ కార్యక్రమం ప్రారంభించిన సమయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆటోల వెనుక జగన్ ఫోటో అంటించుకొండి, మీ పై పోలీసులు ఎటువంటి కేసులు పెట్టరు, మిమ్మల్ని ఆపరు అంటూ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్నారో, లేక ప్రభుత్వం ఆదేశించిందో కాని, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. జగన్ మోహన్ రెడ్డి స్టికర్లు పట్టుకుని రోడ్డు మీదకు వచ్చారు పోలీసులు. వచ్చే పోయే ఆటోలను ఆపుతూ, వారికి ఇష్టం లేకపోయినా, చివరకు వారికి 10 వేలు రాకపోయినా సరే, స్టికర్ లు అంటించి వేసారు. కృష్ణా జిల్లలో, రవాణా శాఖ సిబ్బంది, పోలీసులు, ఖాకీ యునిఫారం ధరించి మరీ, జగన్ మోహన్ రెడ్డి స్టికర్లు అంటిస్తూ వీడియోకి చిక్కారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
విజయవాడ బందరు రోడ్డులో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యంలో రవాణా, పోలీసు సిబ్బంది ఈ పని చేసారు. పోలీసులు ఉండటంతో, అటోవాలాలకు ఇష్టం లేకపోయినా తప్పలేదు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ వార్తలు వచ్చాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియానే కాదు, నేషనల్ మీడియాలో కూడా ఈ భాగోతం వచ్చింది. ‘మా గురించి ఆలోచన చేసిన జగనన్నకు థ్యాంక్యూ - వైఎ్‌సఆర్ వాహన మిత్ర’ అనే స్టిక్కర్లను, ఆటలను ఆపి మరీ, వీరు అంటించటం పై, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గతంలో ఏపి పోలీసులకు ఎన్నో జాతీయ అవార్డులు వచ్చాయని, అలంటి పోలీసుల చేత, ఇలా ఆటోలకు స్టికర్లు అంటించే పని చెయ్యటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే మద్యం దుకాణాల్లో తనిఖీలు చేసే ఎక్ష్సైజ్ పోలీసుల చేతే, మద్యం అమ్మించటం పై కూడా విమర్శలు వస్తున్నాయి.