‘ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరు’ ఇది ఓ సినిమాలోని పాట అయినప్పటికీ ప్రస్తుతం ఏపీలోని రాజకీయ పార్టీల పరిస్థితికి, ఆ పార్టీలను అభిమానించే శ్రేణుల పరిస్థితికి అద్దం పడుతోంది. దాదాపు 43 రోజుల ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. దీంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బెట్టింగ్ రాయుళ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీ ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ అంచనాలు వ్యక్తం చేయడంతో ఈ గందరగోళం మరింత పెరిగింది. కొన్ని సర్వేలు టీడీపీదే అధికారమని, మరికొన్ని సర్వేలు వైసీపీదే అధికారమని అంచనా వేశాయి. దీంతో ఏది నిజమో, ఏది అబద్ధమో ఒక అంచనాకు రాలేక బెట్టింగ్ రాయుళ్లు బుర్ర బద్ధలు కొట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది.
జనసేన తక్కువ సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసిన సర్వే సంస్థలు ఆ పార్టీ పోటీ వల్ల జరిగే ఓట్ల చీలిక ఎక్కువగా నష్టపోయే పార్టీ ఏదనే ప్రశ్నకు సమాధానమివ్వలేకపోయాయి. ఎగ్జిట్ పోల్స్‌కు తోడు ఛానల్స్‌లో రాజకీయ విశ్లేషకులు ఆ ఎగ్జిట్ పోల్స్‌పై వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఏపీ ఫలితాలపై ఆసక్తి ఉన్న ఏ ఒక్కరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆ రాజకీయ విశ్లేషకుడు చేసిన విశ్లేషణ సరైందని కొందరు.. లేదు.. లేదు.. ఈ రాజకీయ విశ్లేషకుడు ఏం అంచనా వేస్తే అదే గతంలో జరిగిందని మరికొందరు ఇలా విశ్లేషణలపై విశ్లేషించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రచ్చబండ మనుషుల పిచ్చాపాటి చర్చల నుంచి రాజకీయ పార్టీ నేతల చర్చల దాకా.. అందరూ చర్చించుకుంటున్న అంశం ఏపీ ఫలితంపైనే కావడం గమనార్హం.
ఏ టీ కొట్టు దగ్గర నిల్చున్నా, ఏ రెస్టారెంట్లో తింటున్నా అంతా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుందనే చర్చలే తప్ప మరొక్కటి కనిపించని పరిస్థితి. ఏపీ అసెంబ్లీ ఫలితం.. అందుకే సీఎం ఎవరనే చర్చ ఆ రాష్ట్రంలో జరుగుతుందని భావిస్తే పొరపాటే. కేవలం ఏపీలో మాత్రమే కాదు.. తెలంగాణ పల్లెల్లో.. హైదరాబాద్ గల్లీల్లో.. ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు సమాధానం కోసం పార్టీల నేతలు, ఆ పార్టీల శ్రేణులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కష్టం చేసుకునే కామన్ మ్యాన్ మాత్రం ఎవరొచ్చినా తమ కష్టం తప్పదంటూ నిట్టూరుస్తున్నారు.