తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయంలో జనసేన కూడా తన వంతు పాత్ర పోషించినట్లు స్పష్టమైంది. ఫ్యాన్ హోరుతో టీడీపీ ఓటమిపాలు కాగా మరీ తక్కువ సీట్లు రావడానికి జనసేన కారణమనే వాదన వినిపిస్తోంది. వైసీపీ విజయం సాధించిన 32 చోట్ల.. అది సాధించిన మెజారిటీ కంటే జనసేన గణనీయమైన ఓట్లు సాధించడం గమనార్హం. 2009లో ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని ఇలాగే దెబ్బతీసింది. ఆ ఎన్నికల్లో టీడీపీ 80 స్థానాల్లో రెండో స్థానంలో నిలువగా.. అక్కడ కాంగ్రెస్ సాధించిన మెజారిటీ కంటే పీఆర్పీకి అధిక ఓట్లు రావడం విశేషం. అలాగే ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం 5 వేల ఓట్ల లోపు ఓడిపోయిన స్థానాలు 28 వరకు ఉన్నాయి.
ఈ దఫా ఎలమంచిలిలో టీడీపీ అభ్యర్థిపై వైసీపీకి 4 వేల ఓట్లు అధికంగా రాగా.. జనసేనకు 16,500 ఓట్లు వచ్చాయి. రామచంద్రపురంలో వైసీపీకి 5వేల ఓట్లు మెజారిటీ దక్కగా.. జనసేనకు 17,592 ఓట్లు వచ్చాయి. తణుకులో వైసీపీ 1264 ఓట్లతో గెలిస్తే జనసేనకు అక్కడ 35502 ఓట్లు పడ్డాయి. విజయవాడ వెస్ట్‌లో వైసీపీ 6వేల ఓట్ల తేడాతో గెలిస్తే జనసేనకు 22,312 ఓట్లు వచ్చాయి. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ 1587 ఓట్లతో ఓడిపోగా జనసేనకు 4104 ఓట్లు పడ్డాయి. తిరుపతిలో వైసీపీ 708 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచింది. ఇక్కడ జనసేన అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తికి 12వేలకు పైగా ఓట్లు వచ్చాయి.
తాజా ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీపై ప్రజారాజ్యం తాలూకు నీలినీడలు కనిపించాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ 18 స్థానాల్లో గెలవడం, అనంతరం ఆ పార్టీని కాంగ్రెస్‌లో కలిపివేయడంతో ఓటర్లలో ఇంకా ఆ జ్ఞాపకాలు చెదిరిపోలేదు. ఆ ప్రభావం జనసేనపై కనిపించిందని చెప్పవచ్చు. 2009లో ప్రజారాజ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 18 స్థానాలు గెలిచింది. తెలంగాణను మినహాయించి మిగిలిన ఆంధ్రప్రదేశ్‌ను పరిగణిస్తే 16 స్థానాల్లో ప్రజారాజ్యం గెలిచింది. ప్రస్తుత ఫలితాల్లో జనసేన ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోవడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తెలుగుదేశం 35 సీట్లలో ఓడిపోవటానికి ఒక కారణం అయిన పవన్ కళ్యాణ్ కు, వైసీపీ కార్యకర్తలు థాంక్స్ చెప్తున్నారు.