ఈ ఎన్నికల్లో తెదేపా నూటికి వెయ్యిశాతం గెలవబోతోందని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. దేశ భవిష్యత్తు కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే జాతీయ స్థాయిలో ఎన్డీయేలో లేని పార్టీలతో ప్రత్యామ్నాయం ఏర్పాటుకి ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తాను ప్రధాని రేసులో లేనని ఆయన స్పష్టంచేశారు. శనివారం రాత్రి చంద్రబాబు కొందరు పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆదివారం ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్న నేపథ్యంలో, పార్టీ అనుసరించాల్సిన విధానం ఎలా ఉండాలన్న దానిపై ఆయన దిశానిర్దేశం చేశారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకి తాను చేస్తున్న ప్రయత్నాలు, అక్కడ ఏ పదవీ ఆశించి చేయడం లేదని, ఈ విషయాన్ని పార్టీ నాయకులు వివిధ వేదికలపై మాట్లాడినప్పుడు స్పష్టంగా చెప్పాలని సూచించారు.
దేశం, రాష్ట్ర ప్రయోజనాల కోసమో తాము పోరాడుతున్నామని, తెలుగు వారు గర్వపడే పనులే చేస్తున్నాం తప్ప, ఎవరూ తలొంచుకునేలా చేయడం లేదని ఆయన తెలిపారు. ఒకప్పుడు ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో నిర్వహించిన పాత్రను, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా తాను నిర్వహిస్తున్నానన్నారు. ‘‘నాకు ప్రధాని అవ్వాలన్న కోరిక లేదు. దేశం బాగుపడాలన్న ఉద్దేశంతోనే ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నాం’’ అని తెలిపారు. 2014లో కొన్ని జాతీయ ఛానళ్లు ఎగ్జిట్‌పోల్స్‌లో వైకాపా గెలుస్తుందని చెప్పాయని, కానీ తెదేపా ఘన విజయం సాధించిందని ఆయన గుర్తుచేశారు.
ఆదివారం కూడా కొన్ని ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్‌లో వైకాపా గెలుస్తుందని చెప్పే అవకాశం ఉందని.. కానీ, 23న వెలువడే ఫలితాల్లో గెలుపు తెదేపాదేనని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పసుపు-కుంకుమ, అన్నదాతా సుఖీభవ, పింఛన్ల పెంపు వంటి పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ప్రతిపక్షాలు ఎన్ని విధాల అడ్డు పడాలని చూసినా ప్రకృతి మనకు సహకరించింది. మహిళలు తెదేపాకి ఏకపక్షంగా ఓట్లు వేశారు. ఓటింగ్ పెద్ద ఎత్తున జరగడం, క్యూల్లో గంటల తరబడి నిలబడి మరీ ఓట్లు వేయడం మనకు సానుకూలాంశాలు. మనమే గెలుస్తున్నాం’’ అని ఆయన ధీమా వ్యక్తంచేశారు.