‘‘సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈరోజు ముగుస్తోంది. రెండోసారి అధికారం దిశగా నరేంద్ర మోదీ రంగం సిద్ధం చేసుకున్నారు. ఎన్‌డీయేకు మెజారిటీ రాకున్నా మైనారిటీలో ఉన్నా ఆయన ఆగరు. ప్రభుత్వ ఏర్పాటుకు కుయుక్తులు పన్నుతారు. మనం ఆపాలి. మన శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించి నిరోధించాలి. దీనికి ఒకే ఒక మార్గం మనం యునైటెడ్‌గా కనిపించడం! మనం ఒక్క మాట మీద ఉన్నామని గ్రహిస్తే ఆయన పాచికలేవీ పారవు. ఇందుకు కలిసి రండి... ఆలస్యం వద్దు. ఏమాత్రం జాగు చేసినా మోదీ వచ్చేస్తారు...’’ ఇదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జాతీయ విపక్ష నేతలకు చెప్పిన మాట. ఆయన మాటను విన్న ఆ నేతలంతా దానితో ఏకీభవించారు.
ఒక మాటపై ఉండేందుకు అంగీకరించినట్లు సమాచారం. జాతీయస్థాయిలో ఎన్డీయేకు బలమైన ప్రత్యామ్నాయ ఏర్పాటు దిశగా ఏర్పాట్లు శనివారంనాడు ఊపందుకున్నాయి. వీటికి చంద్రబాబే సంధానకర్త. ఢిల్లీలో ఆయన విపక్ష నేతలందరినీ కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పరిశీలన ప్రకారం ప్రస్తుతం విపక్ష శిబిరం నాలుగు రకాలుగా చీలి ఉంది. (1)యూపీఏ (2)యూపీఏకు అనుకూలంగా ఉన్న టీడీపీ తదితర పార్టీలు. (3)తృణమూల్, బీజేడీ, టీఆర్‌ఎస్, వైసీపీలాంటి పార్టీల తటస్థ, ఫెడరల్-ఫ్రంట్ అనుకూల కూటమి (4)ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహాకూటమి(ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ). ఈ పార్టీలన్నింటినీ ఒకచోట చేర్చే పనిని చంద్రబాబు భుజానికెత్తుకున్నారు. ఆయా నాయకులందరి దగ్గరికీ తానే స్వయంగా వెళ్లి- ‘ఏకం కాకపోతే ముప్పే’ అనే హెచ్చరికలు చేసి, వారిని ఒప్పించి వస్తున్నారు.
శనివారంనాడు ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, ఎన్‌సీపీ నేత శరద్ పవార్, లోక్ తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్, సీపీఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, డి.రాజాలతో సమాలోచనలు జరిపారు. మధ్యాహ్నం లఖ్‌నవూలో సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిలతో చర్చలు జరిపారు. అనంతరం ఢిల్లీ తిరిగి వచ్చారు. ఒకట్రెండు రోజులు ఆయన ఢిల్లీలోనే ఉండి మిగిలిన ఎన్డీఏతర పక్షాలనేతలతో కూడా చర్చలు జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నెల 23న ఎన్డీఏ పక్షాల నేతలందరూ ఢిల్లీలో ఉండి వేగంగా స్పందించి భవిష్యత్ కార్యాచరణకు పూనుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఇప్పటికే సీతారాం ఏచూరి, అరవింద్ కేజ్రీవాల్ మొదలైన నాయకులను కలిశారు.