మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న, జనసేన పార్టీ గెలుపోటముల పై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ఎన్ని సీట్లు గెలుస్తుంది.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి ఏంటి.. కింగ్ మేకర్ అవుతారా.. ఇలా పలు సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఆంధ్రా అక్టోపస్‌గా పేరున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ప్రజారాజ్యం కంటే పవర్ స్టార్‌కు తక్కువ సీట్లే వస్తాయన్న ఆయన.. వెలగపూడిలోని అసెంబ్లీలోకి పవర్ స్టార్ కచ్చితంగా అడుగుపెడతారని వ్యాఖ్యానించారు. కచ్చితమైన మెజార్టీతోనే ప్రభుత్వం వస్తుందని... సమైక్య రాష్ట్రంలో కానీ, రెండు రాష్ట్రాల్లో కానీ తెలుగు ప్రజలు స్పష్టమైన తీర్పునే ఇస్తున్నారన్నారు.
ఇక జేడీ.లక్ష్మీనారాయణ రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి అన్నారు. ఆయన భవిష్యతేంటో ఆదివారం చెబుతానన్నారు. లోకేష్ గురించి అడగగా, ఆ విషయం కూడా ఆదివారం చెప్తానంటూ తప్పించుకున్నారు. తనకు టీడీపీతో కంటే వైఎస్ కుటుంబంతోనే ఎక్కువ అనుబంధం ఉందన్నారు. వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు వెళ్లి నివాళులర్పించి జగన్ కలిశానన్నారు. తనకు ఏ పార్టీతో శత్రుత్వం లేదని ముగించారు. తన ఫలితాలను బట్టి ఎవరూ బెట్టింగ్‌లు కాయొద్దని సూచించారు. తన సర్వేను సవాల్‌తో చెప్పడం లేదన్నారు. ఫలానా పార్టీ గెలుస్తుందని బల్ల గుద్ది చెప్పడం లేదని చెప్పారు. కేవలం అంచనా మాత్రమే చెబతున్నానని స్పష్టంచేశారు. తెలంగాణలో తన ఫలితం ఎందుకు ఫెయిలైందో త్వరలో చెబుతానన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్లీ సైకిలే ఎక్కారనిలగడపాటి రాజగోపాల్ స్పష్టంచేశారు. ఇక తెలంగాణ ప్రజలైతే మళ్లీ కారే ఎక్కారని చెప్పారు. ఇది ‘నా టీమ్ అందించిన సర్వే’ కాదన్నారు. కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే చెబుతున్నానని పేర్కొన్నారు. నెల రోజుల నుంచి అమెరికాలో ఉంటున్నానని ఇక్కడేం జరుగుతుందో తనకు తెలియదన్నారు. నిన్న సాయంత్రమే ఏపీకి వచ్చినట్లు తెలిపారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఆదివారం తిరుపతిలో వెల్లడిస్తామని చెప్పారు. ఏపీలో మూడు పార్టీలు పోటాపోటీగా తలపడ్డాయన్నారు. 90-99 శాతం మంది ప్రజలు ఈ మూడు పార్టీలకే ఓట్లేశారన్నారు. ఈ మూడు పార్టీల్లో ఒకరే విజేతగా నిలుస్తారన్నారు. మరొకరు ప్రతిపక్షంలో ఉంటారన్నారు. ఎవరు ఏ పొజిషన్లో ఉన్న కలిసి కట్టుగా రాష్ట్రాభివృద్ధికి పాటు పడాలని విజ్ఞప్తి చేశారు.