తిరుపతి కౌంటింగ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. ఎన్నికల అధికారులు కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎంలు ఉన్నాయా?. లేవా?. ఉంటే సురక్షితంగా ఉన్నాయా? అనే విషయాలపై అధికారుల నుంచి సమాచారం లేదు. దీంతో స్థానిక నేతల్లో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం ఘటనాస్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతోంది. కాగా ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. తిరుపతిలోని ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కాలేజిలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తుండగా మంటలు చెలరేగాయి.
ఏసీ యంత్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఎండ వేడిమి కారణంగానే ఏసీలో ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదం జరగడంతో అక్కడున్న వారు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు రంగప్రవేశం చేసి మంటలను ఆర్పేశారు. టిడిపి వర్గాలు తెలుసుకొని, అక్కడికి వచ్చేసరికి,ఓ కర్ణాటకా రిజిస్ట్రేషన్ కారు, వేగంగా బయటకు వచ్చి దూసుకుపోయింది. అక్కడి ఎస్ ఐ అని అడిగితే తడబాటుతో ఇప్పుడే విధులకు వచ్చానని చెప్పిన్నట్టు, టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
ఇవిఎంలకు ఏమీ కాలేదని చెబుతున్నారు. అయినా ఇవిఎంల మీద ఇంత రచ్చ జరుగుతున్నా, ఏదో జరుగుతోందని గుబులుగా వున్న సమయంలో, ఇలాంటి నిర్లక్ష్యం ఏమిటో... కాగా, ఇదే కాలేజీలో పోలింగ్ కు ముందురోజు కూడా అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో మానిటరింగ్ రూమ్ లోని ల్యాప్ టాప్ లు అగ్నికి ఆహుతయ్యాయి. మళ్లీ అదే కేంద్రంలో అగ్నిప్రమాదం జరగడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.