ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలతో ఉత్కంఠ తీవ్రస్థాయికి వెళ్లడమే కాదు.. కొత్త లెక్కలకు తెరతీసింది. ఎవరికి వారు తమకు అనుకూలంగా వచ్చిన సర్వేయే గొప్పదని చెప్పుకొంటున్నారు. ప్రత్యర్థి పార్టీ గెలుస్తుందని వచ్చిన సర్వేలో ఉన్న లోటుపాట్లను వెతుకుతున్నారు. విపక్ష వైసీపీ అభిమానులు ఎగ్జిట్‌పోల్స్‌ అనంతరం సరికొత్త లెక్కలు వేస్తున్నారు. టీడీపీకి ఓట్ల శాతం ఎక్కువ వచ్చినా.. అత్యధిక సీట్లు తమకే వస్తాయంటున్నారు. అదేమిటని అడిగితే.. ‘టీడీపీ ఎక్కువ ఆధిక్యంతో తక్కువ స్థానాలు గెలుస్తుంది.. మేం తక్కువ ఆధిక్యాలతోనైనా ఎక్కువ సీట్లు గెలుస్తాం. మొత్తంగా చూస్తే రెండుశాతం ఓట్లు తెలుగుదేశానికి ఎక్కువ వచ్చినా.. సీట్ల సంఖ్య మాత్రం మాకే ఎక్కువగా ఉంటుంది’ అని జోస్యం చెబుతున్నారు. లగడపాటి గతంలో తప్పుగా చెప్పిన సర్వేలను ప్రస్తావిస్తూ.. ఆయన చెప్పిందే ఫైనల్‌ కాదంటున్నారు. ఇక ఎగ్జిట్‌పోల్స్‌ టీడీపీలో విశ్వాసం పెంచాయి. తాము వేసుకున్న అంచనా.. ఈ ఫలితాలు సరిపోతున్నాయని ఆ పార్టీ చెబుతోంది. మహిళాదరణ తమను విజయపథాన నడుపబోతోందని ధీమా వ్యక్తం చేస్తోంది.

apexitpolls 2052019

ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ ఒకేలా లేవు. కొన్ని వైసీపీ గెలుస్తుందని, కొన్ని తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఇచ్చాయి. ఇదే సమయంలో పలు సంస్థలు ఏదో ఒకటి వండివార్చి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలని చెప్పి వెల్లడించేశాయి. మరికొన్నిటిని ఆయా రాజకీయ పార్టీల అభిమానులే తయారుచేసి వాట్స్‌పలలోకి వదిలేశారు. అదే సమయంలో టీడీపీ, వైసీపీ సహా ఆయా పార్టీలు తొలి నుంచీ తమకు సర్వేలు చేయడానికి కొన్ని సంస్థలను నియమించుకున్నాయి. ఇవి ఎగ్జిట్‌పోల్స్‌లో తమకు కాంట్రాక్టులు ఇచ్చిన పార్టీలే గెలుస్తాయని నివేదికలు ఇచ్చాయి. అయితే ప్రధానంగా గతం నుంచీ సర్వేలు చేస్తున్న సంస్థలు, టీవీలు మాత్రం ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే స్పష్టం చేస్తున్నాయి. జాతీయ చానళ్లలో ఎక్కువభాగం, జాతీయ సర్వే సంస్థల్లో ఎక్కువ భాగం వైసీపీ గెలుస్తుందని అంచనాలు వెలువరించాయి.

apexitpolls 2052019

ఎగ్జిట్‌ పోల్స్‌ ఇచ్చిన ప్రఖ్యాత సంస్థల్లో అత్యధిక శాతం టీడీపీ, వైసీపీ మధ్య వ్యత్యాసం 15-20 సీట్ల మధ్యే ఉంటుందని పేర్కొన్నాయి. ఒక పార్టీకి వందకు అటూ ఇటూ వస్తే.. ఇంకో పార్టీకి 80కి అటూ ఇటూ వస్తాయని అంటున్నారు. అంటే పది సీట్లు అటూ ఇటూ అయితే అన్నట్లుగా వ్యవహారం ఉంది. మరోవైపు అసలీ ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ మూకుమ్మడిగా ఒకే పార్టీ వైపు మొగ్గలేదు. దీంతో ఫలితం ఎటైనా కావొచ్చనిపిస్తోందని, ఈ ఆందోళన లెక్కింపు వరకూ కొనసాగుతుందని ఇరు పార్టీల నేతలు ఆంతరంగికంగా అంగీకరిస్తున్నారు. ప్రఖ్యాత సంస్థలే కాకుండా.. పలు ఇతర సంస్థలు కూడా ఎగ్జిట్‌పోల్స్‌ ఇచ్చాయి. ఇందులో అత్యధిక శాతం సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్నవే. ఈ సంస్థలు గెలవబోయే ఏ పార్టీకైనా 115-125 మధ్య ఇచ్చాయి. ప్రత్యర్థి పార్టీకి 50-60 సీట్లలోపే ఇచ్చాయి. అయితే ఇవి ఏదో ఒక పార్టీకి అభిమానులుగా ఉన్నవారు తయారుచేసిన ఎగ్జిట్‌పోల్స్‌ అన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎంపీ స్థానాల విషయంలోనూ స్పష్టత లేదు. జాతీయ టీవీ చానళ్లలో ఎక్కువశాతం వైసీపీకి అత్యధిక సీట్లు వస్తాయని తేల్చగా.. రాష్ట్రస్థాయిలో లగడపాటి, ఇతర సర్వేలు తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని తేల్చాయి.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read