ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల ఫలితాలతో రాజకీయ వర్గాల్లో టెన్షన్‌ అమాంతం పెరిగిపోతోంది. దీంతో వాస్తవ ఫలితాలపై సామాన్య జనంలో కూడా ఉత్కంఠ పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా పలు సంస్థలు సర్వేల ఫలితాలు ప్రకటించడం, అవన్నీ పరస్పర విరుద్ధంగా వుండడంతో అందరిలో అయోమయం నెలకొంది. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అర్థంకాని పరిస్థితిలో పడ్డారు. అయితే జిల్లాలో మాత్రం మిగిలిన సంస్థల ప్రకటనల గురించి జనం పట్టించుకోవడం లేదు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఈ రాష్ట్రానికి చెందిన వారు కావడం, చాలా ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు నిర్వహించిన నేపథ్యం వుండడంతో ఆయన ప్రకటన మాత్రం జిల్లా ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపుతోంది. లగడపాటి సర్వే ఫలితాలతో ఆదివారం సాయంత్రం దాకా జోరుమీదున్న వైసీపీ వర్గాలను నీరసం ఆవహించింది. ఆ పార్టీ నేతలను అభద్రతా భావానికి లోను చేసింది. అదే సమయంలో టీడీపీ శ్రేణుల్లో జోష్‌ను పెంచింది. ప్రతిసారీ ఎన్నికల సందర్భాల్లో ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఫలితాల పట్ల జనం ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నడుమ హోరాహోరీ పోటీ జరిగింది. మధ్యలో జనసేన కూడా టీడీపీ, వైసీపీ గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో పోటీ ఇచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లో నాయకత్వం విషయంలో కొత్త తరాన్ని తీసుకొస్తున్న ఎన్నికలు కావడంతో జనంలో ఫలితాల పట్ల విపరీతమైన ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది.

గత నెల 11న పోలింగ్‌ ముగియడంతో అప్పటి నుంచీ జిల్లాలో ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలు గెలుపు తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చివరి విడత పోలింగ్‌ ఆదివారం కావడంతో ఆదివారం సాయంత్రం వరకూ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఫలితాల వెల్లడిపై నిషేధం వున్న సంగతి తెలిసిందే. దీంతో ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు నిర్వహించిన సంస్థలు ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఫలితాలను ప్రకటించాయి. దేశవ్యాప్తంగా పలు మీడియా, ప్రైవేటు సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఫలితాలు పరస్పర భిన్నంగా వుండడంతో రాజకీయవర్గాలతో పాటు సామాన్య జనం కూడా అయోమయంలో పడ్డారు. సర్వే ఫలితాలు వెల్లడించిన సంస్థల్లో కొన్ని మాత్రమే పేరుప్రతిష్టలు కలిగినవి. మిగిలినవి ప్రాముఖ్యత, విశ్వసనీయత లేనివన్నది జనం భావన. అయితే ప్రతిష్టాత్మక సంస్థలు బయటపెట్టిన సర్వే ఫలితాలు కూడా ఏకరీతిలో లేకపోవడమే అయోమయానికి దారితీస్తోంది.

జాతీయస్థాయి ప్రాముఖ్యత కలిగిన సర్వే సంస్థలు వెల్లడించిన ఫలితాలను నిజానికి విద్యాధికులు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. అదే లగడపాటి రాజగోపాల్‌ వెల్లడించిన ఆర్‌జీ ఫ్లాష్‌ టీమ్‌ సర్వే ఫలితాలు మాత్రం జిల్లావ్యాప్తంగా రాజకీయ వర్గాలను, సామాన్య జనాన్ని గణనీయంగా ప్రభావితం చేశాయి. ఎందుకంటే లగడపాటి ఈ రాష్ట్రానికి చెందిన రాజకీయ నేత. జనానికి బాగా తెలిసిన వ్యక్తి. ఆయన చాలా కాలంగా ఎన్నికలప్పుడు ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు నిర్వహించడం, ఆ ఫలితాలు చాలా వరకూ వాస్తవానికి చేరువగా వుండడం కూడా జిల్లా ప్రజలకు తెలుసు. ఇటీవలి తెలంగాణ ఎన్నికల విషయంలో ఆయన అంచనా కొంతమేరకు తప్పినప్పటికీ ఆదివారం తిరుపతిలో ఆయన తాజా సర్వే ఫలితాలు వెల్లడించే సందర్భంలో తన సర్వే విశ్వసనీయత, నిబద్ధతల గురించి చేసిన వ్యాఖ్యలు జనంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ కారణంగా ఆదివారం రాత్రి లగడపాటి వెల్లడించిన ఫలితాలు జిల్లాలో రెండు ప్రధాన పార్టీల శిబిరాలను షేక్‌ చేసింది. అప్పటి దాకా వైసీపీ శ్రేణులు గానీ, నేతలు గానీ ఎన్నికల్లో గెలిచేది తమ పార్టీయేనని, అధికారం కూడా తమదేనని బలంగా నమ్ముతూ వచ్చాయి. వారిలో అలాంటి భావన ఏర్పడేలా పార్టీ నేతలు కూడా బిల్డప్‌ ఇస్తూ వచ్చారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఓ విధమైన అభద్రతా భావం నెలకొంది. నేతలు పైకి ధైర్యంగానే వున్నా కార్యకర్తల్లోనే హుషారు తగ్గింది. అలాంటిది లగడపాటి ప్రకటనతో వైసీపీ శ్రేణులు పూర్తిగా డీలా పడ్డాయి.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read