ఎన్నికల సమరం ముగిసింది . పలు జాతీయ సర్వేల సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇచ్చేశాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ గందరగోళంగా, వాస్తవానికి దూరంగా ఉన్నాయి. కేంద్రంలో ఎన్డీఏ నేతృత్వంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, 2014 కంటే భారీగా ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ లో వండి వార్తచారు. మరో పక్క రేపు ఎన్డీఏ పార్టీలని డిన్నర్ కి పిలిచారు అమిత్ షా. ఈ తరుణంలో చంద్రబాబునాయడుు మరోసారి ఢిల్లీ పర్యటన చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది. ఏ మాత్రం వెనుకంజ వెయ్యకుండా ఏపీ సీఎం చంద్రబాబు సమరానికి సై అంటున్నారు.
సోమవారం నాడు మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బెంగాల్ సీఎంత మమత బెనర్జీతో భేటీ అయ్యారు.. ఎగ్జిట్ పోల్స్ నేపధ్యంలో భవిష్యత్ ప్రణాళికపై ఆమెతో చర్చించేందుకు అమరావతి నుండి చంద్రబాబునాయుడు సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంటకు బెంగాల్ వెళ్లారు. మంగళవారం నాడు విపక్ష పార్టీలతో భేటీ కానున్నారు. హస్తిన వేదికగా ఎన్నికల సంఘంపై , కేంద్ర సర్కార్ పై పోరుకు సిద్ధం కావాలని, అందరూ కలిసి రావాలని చంద్రబాబు విపక్ష పార్టీలను కోరతున్నారు. దేశరాజధాని ఢిల్లీలో మరోసారి ధర్నా చెయ్యాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. మంగళవారం మధ్యాహ్నం అన్ని పార్టీలతో కలిసి ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు.
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం తీరు, ఈవీఎంల పనితీరు, వీవీ ప్యాట్ల లెక్కింపు వంటి అంశాలపై నిరసన తెలియజేయాలని నిర్ణయించారు.సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదాస్పదం చేసిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ అందరినీ బ్లాక్‌మెయిల్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఉదయం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించారు. ఎగ్జిట్ పోల్స్ తో మోడీ మైండ్ గేమ్ ఆడుతున్నా, చంద్రబాబు ఏ మాత్రం వెనకడుగు వెయ్యకుండా పోరుబాట పట్టారు.