కేసీఆర్, స్టాలిన్ మధ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చింది. ‘‘ఏపీలో మీరు అనుకొంటున్నట్లు చంద్రబాబు గెలవడం లేదు. జగన్ గెలుస్తున్నారు. ఆయనకు ఎంపీ సీట్లు 18 నుంచి 21 వరకూ వస్తాయి’’ అని కేసీఆర్ చెప్పారు. ‘అది మీ అభిప్రాయం కావచ్చు’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈ విషయాలన్నీ మంగళవారం చంద్రబాబుకు దొరై మురుగన్ వివరించారు. తమిళనాడులో రాజకీయ పరిస్థితిని, ఇటీవల జరిగిన ఎన్నికల సరళిని చంద్రబాబు ఆయనను అడిగి తెలుసుకొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఫలితాల సరళి ఎలా ఉందో తన అంచనాలను ఆయనకు వివరించారు. వివిధ పార్టీల అధినేతల ఆలోచనలు ఎలా ఉన్నాయో కూడా చంద్రబాబు ఆయనకు చెప్పినట్లు సమాచారం.
‘‘23వ తేదీ ఫలితాల వెల్లడి తర్వాత అందరం అప్రమత్తంగా ఉండాలి. ఎంపీలకు ఎర వేయడానికి... పార్టీల్లో చీలికలు తేవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి. అన్నీ చూసుకోండి. బీజేపీ వచ్చే అవకాశం లేదని తెలిస్తే మెజారిటీ పార్టీలు మన వైపు తిరుగుతాయి. రకరకాల ప్రతిపాదనల పేరుతో వాటిని చీల్చడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కొత్త కొత్త ఫ్రంట్లను తెరపైకి తెస్తారు. తాను నేరుగా అధికారంలోకి రాకపోయినా తన ప్రభావం ఉండే ప్రభుత్వం ఏర్పడాలని అయినా బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇవన్నీ చూసుకోవాలి. మనం టచ్‌లో ఉందాం’’ అని ఆయనతో చంద్రబాబు చెప్పారు. ఈ భేటీ తర్వాత దొరై మురుగన్ తన సతీమణితో కలిసి విజయవాడలో కనకదుర్గ దేవాలయాన్ని సందర్శించి అనంతరం చెన్నై వెళ్లిపోయారు.
ఏదేమైనా జాతీయ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో చంద్రబాబు గతంలో చేసిన ప్రయత్నాలు సఫలం అయిన సందర్భాలున్నాయి. కేసీఆర్ తొలిసారిగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. 16కు 16 స్థానాలు గెలుచుకుంటే కేంద్రంలో తాము చెప్పిన వ్యక్తే ప్రధాని అవుతారనే ప్రచారాన్ని టీఆర్‌ఎస్ జోరుగా చేస్తోంది. బీజేపీ వ్యతిరేక కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు విశ్వసిస్తున్నారు. ఆ కూటమిలో తమ పార్టీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇక కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడానికి ఎన్డీయే గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తే వైసీపీ అధినేత జగన్ బీజేపీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీతో పాటు తమిళనాడులో అన్నాడీఎంకే కూడా బీజేపీకి మద్దతుగా నిలిచే అవకాశాలు లేకపోలేదు.