Sidebar

14
Fri, Mar

ఏపీలో మరో 5 కేంద్రాల్లో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 19న(ఆదివారం) చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని 5 పోలింగ్‌ కేంద్రాల్లో అసెంబ్లీ, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి రీపోలింగ్‌ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఈవో గోపాలకృష్ణ ద్వివేది బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, చంద్రగిరిలో రీపోలింగ్‌పై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ అడిగిన బూత్‌లను పరిగణనలోకి తీసుకోకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ అడిగిన 7 బూత్‌లలో 5 బూత్‌లకు ఎన్నికలు జరపడం సరికాదన్నారు. టీడీపీ అడిగిన స్థానాల్లోనూ రీపోలింగ్‌ జరపాలని తెలిపారు. ఈసీ పక్షపాత ధోరణి మరోసారి రుజువైందన్నారు. రీపోలింగ్‌పై గురువారం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తామని చంద్రబాబు చెప్పారు.

cbn 16052019

రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 49 కేంద్రాల్లో అక్రమాలు జరిగితే ఎన్నికల సంఘం పక్షపాత వైఖరితో ఇష్టారాజ్యంగా వ్యవహరించటం సమంజసంకాదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళావెంకట్రావ్ నిరసన వ్యక్తం చేశారు. బుధవారం సచివాలయంలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారి సుజాతశర్మను కలిసి ఈ 49 కేంద్రాల్లోనూ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించిందంటూ, నియోజకవర్గంలోని 166,310 పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని టీడీపీ చేసిన ఫిర్యాదుపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పోలింగ్ రోజునే టీడీపీ అభ్యర్థి నానీ.. ఈసీకి పరిస్థితిని వివరించారని గుర్తుచేశారు.

cbn 16052019

పోలింగ్ ముగిసిన 24 రోజుల తరువాత వైసీపీ అభ్యర్థి కొన్ని బూత్‌లపై ఫిర్యాదు చేస్తే సీఈఒ విచారణకు ఆదేశించటం మంచి సాంప్రదాయం కాదన్నారు. రాష్ట్రంలో ఈనెల 6వ తేదీన ఒకవిడత రీపోలింగ్ నిర్వహించారని ఇప్పుడు కొత్తగా విచారణ జరిపి మరోసారి రీపోలింగ్‌కు అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం అధికారులు పారదర్శకంగా వ్యవహరించటం లేదని ఆక్షేపించారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించటం ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమన్నారు. చంద్రగిరిలో రీపోలింగ్‌కు నిర్ణయించటంతో ఎన్నికల అధికారుల పనితీరును శంకించాల్సి వస్తోందన్నారు. అక్రమాలు జరిగిన అన్ని కేంద్రాల్లో విచారణ జరిపి రీపోలింగ్ జరపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సుజాత శర్మ స్పందిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రస్తుతం సెలవులో ఉన్నారని ఆయన విధులకు హాజరైన అనంతరం పరిస్థితిని వివరిస్తామన్నారు. టీడీపీ డిమాండ్ చేస్తున్న కేంద్రాల్లో కూడా రీపోలింగ్ జరపాలని కళా వెంకట్రావ్ సుజాతశర్మకు వినతిపత్రం సమర్పించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read