రాష్ట్రంలో బీజేపీ సర్వనాశనం కావడానికి పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణయే ప్రధాన కారకుడని, వైసీపీ నేతలతో కుమ్ముక్కై రాజంపేట ఎంపీ టికెట్టు అమ్ముకున్నారని, ఆఖరి క్షణంలో అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నాడని బీజేపీ నాయకులు పలువురు ధ్వజమెత్తారు. బుధవారం రాజంపేటలోని ఓ కల్యాణ మండపంలో రాజంపేట ఎంపీ పరిధిలోని కడప జిల్లాకు చెందిన రాయచోటి, రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ ఆర్గనైజింగ్ కార్యదర్శి మధుకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురే్షరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్రెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనాధ్రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కడప జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి పిండిబోయిన కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజేష్, గిరిజన మోర్చ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్, కోడూరు బీజేపీ అభ్యర్థి పొనతల సురేష్ తదితర నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ కన్నాపై విరుచుకుపడ్డారు.
‘‘రేపు పార్టీలో ఉంటారో.. ఉండరో కానీ బీజేపీని సర్వనాశనం చేశారు’’ అని నిప్పులు చెరిగారు. పార్టీ టికెట్ల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు. రాజంపేట ఎంపీ టికెట్టును వైసీపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డికి ఇచ్చారని, ఆఖరి నిమిషంలో అతను తప్పుకున్నాడని, దీనిలో బీజేపీ నాయకుల హస్తం ఉందని, వాయిస్ రికార్డ్ కూడా తమవద్ద ఉందని రాజేష్ అన్నారు. వైసీపీకి అమ్ముడుపోయిన ఆ నాయకులను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు స్థానిక నాయకత్వానికి, కోర్ కమిటీకి తెలియకుండా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.
నిధులు మింగేశారు... ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి ఖర్చుకోసం ఎంత ఇచ్చారన్న విషయంపై స్పష్టత లేదని, దీనిలో కూడా భారీ ఎత్తున గోల్మాల్ జరిగిందని రాజేష్ సహా పలువురు ధ్వజమెత్తారు. పార్టీకి పంపిన ఎన్నికల నిధులను కూడా గోల్మాల్ చేశారన్నారు. వాటిపై కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. టికెట్ల విషయంలో పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వద్దకు ఆయా నియోజకవర్గాల బీజేపీ నాయకులు వెళ్లి అడిగితే మీరు చెబితే నేను టికెట్టు ఇవ్వాలా.. ఆఫీసు నుంచి వెళ్లిపోండి.. అని హెచ్చరించారన్నారు.