పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోల్‌కతాలో నిర్వహించిన ప్రదర్శనలో హింస చెలరేగడం ప్రకంపనలు సృష్టించింది. మంగళవారం జరిగిన ఈ ప్రదర్శనలో ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం మరింత వివాదాస్పదమయింది. ఇందుకు కారణం మీరంటే మీరని తృణమూల్ కాంగ్రెస్, భాజపాలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. బెంగాల్ ఆత్మగౌరవానికి భంగం కలిగిందని తృణమూల్ ఆరోపించగా, తమపై నింద మోపడానికి కుట్ర జరిగిందని భాజపా ప్రత్యారోపణ చేసింది. ఈ సంఘటనకు నిరసనగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం కోల్‌కతాలో ప్రదర్శన నిర్వహించారు.
సంఘటన తీవ్రత దృష్ట్యా ప్రచారాన్ని ఒక రోజు ముందుగా గురువారమే ముగించాలంటూ ఎన్నికల సంఘం అసాధారణ నిర్ణయాన్ని ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియలో చివరిదైన ఏడో దశలో భాగంగా 9 నియోజకవర్గాలకు ఈ నెల 19న పోలింగ్ జరగాల్సి ఉంది. షెడ్యూలు ప్రకారం శుక్రవారం ప్రచారం ముగియాల్సి ఉండగా, కోల్‌కతాలో జరిగిన ఘర్షణల దృష్ట్యా గురువారం రాత్రి పది గంటలకే ప్రచారాన్ని ముగించాలని ఆదేశించింది. రాజ్యాంగంలోని 324వ అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొని, తొలిసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ చంద్ర భూషణ్ కుమార్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (హోం) అత్రి భట్టాచార్య, అదనపు డీజీపీ (సీఐడీ) రాజీవ్ కుమార్‌లను ఆయా పదవుల నుంచి తొలగించినట్టు తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌లో 324వ అధికరణాన్ని అమలు చేయడాన్ని మమతా బెనర్జీ ఖండించారు. ఈ అధికరణాన్ని విధించేటంతటి శాంతిభద్రతల సమస్యలు రాష్ట్రంలో లేవని చెప్పారు. ఎన్నికల సంఘం ‘‘గతంలో ఎన్నడూ లేని, అప్రజాస్వామిక, అనైతిక నిర్ణయం తీసుకొంది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఈసీ ఇచ్చిన బహుమతి’’ అని ఆరోపించారు. మొత్తం ఆర్‌ఎస్‌ఎస్‌వారితో నిండిపోయిన ఇలాంటి ఎన్నికల సంఘాన్ని తానెప్పుడూ చూడలేదని అన్నారు. ఇద్దరు ఉన్నతాధికారులను కూడా ఈసీ కాకుండా మోదీ, అమిత్‌షాయే తొలగించారని ఆరోపించారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడం భాజపా పనేనని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పార్థ ఛటర్జీ ఆరోపించారు. ఎన్నికల ముందు హింస సృష్టించాలన్న ఉద్దేశంతోనే అమిత్ షా ప్రదర్శన నిర్వహించారని అన్నారు.