మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని కిరాయి హంతకులు హత్య చేశారా... అంటే అవునంటున్నాయి పోలీసు వర్గాలు. అసలు వివేకాను ఎందుకు చంపించారు? ఎవరు హత్య చేయించారు? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. వివేకా కుటుంబంలోని ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు వారు నోరు విప్పకపోవడంతో కాల్ డేటా ఆధారంగా హంతకులు ఎవరన్న దిశగా విచారణ సాగుతున్నట్లు సమాచారం. దీనికోసం ప్రత్యేకంగా మూడు పోలీసు టెక్నికల్ బృందాలను నియమించి ఈ బాధ్యత అప్పగించినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ప్రొఫెషనల్ కిల్లర్స్‌కు ఈ హత్యకు పాల్పడ్డారని, వారికోసం వేట ముమ్మరంగా సాగుతోంది. వివేకా హత్య కేసులో రోజుకొక మిస్టరీ వెలుగులోకి వస్తోంది.
మార్చి 15న మాజీమంత్రి వివేకానందరెడ్డిని అతి దారుణంగా, క్రూరంగా హింసించి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్య ఎందుకు చేశారు? ఎవరు చేయించారు? అన్న దిశగా మొదటి నుంచి దర్యాప్తు సాగిస్తున్న పోలీసులకు రోజుకొక మిస్టరీ వెలుగులోకి వస్తోంది. వివాహేతర సంబంధాలు, భూ సెటిల్‌మెంట్ల వ్యవహారాల్లో వివేకాను హత్య చేశారా అన్న కోణాల్లో మొదట పోలీసులు విచారణ కొనసాగించారు. మొదట ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ఐదు బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేయగా ఆయన బదిలీ తరువాత ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అభిషేక్ మహంతి 11 బృందాలను నియమించి ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. వివాహేతర సంబంధాలు, భూదందాలు, సెటిల్‌మెంట్లు వివాదాల కారణంగా వివేకా హత్య కాలేదని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. కుటుంబ వ్యవహారాలే హత్యకు కారణమని మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి.
ఈ దిశగా దర్యాప్తు చేయగా, కుటుంబంలో కీలకంగా వ్యవహరించే ముగ్గురు వ్యక్తులు సూత్రధారులుగా వ్యవహరించారని పోలీసు విచారణలో తేలింది. వివేకా, ఆయన అనుచరులు, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల ఫోన్ కాల్ డేటాను పోలీసులు సేకరించారు. ఈ కాల్‌డేటాను పూర్తిగా విశ్లేషించి ప్రతి కాల్‌కు సంబంధించిన డేటాను ఎంతో గోప్యంగా విచారించేందుకు మూడు పోలీసు టెక్నికల్ బృందాలను నియమించి వారికి ఈ బాధ్యత అప్పజెప్పారు. ఈ బృందాలు కాల్ డేటాను పూర్తి స్థాయిలో పరిశీలించగా వివేకాను హత్య చేసింది ప్రొఫెషనల్ కిల్లర్సేనని వెల్లడైనట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కిరాయి ముఠాను అదుపులోకి తీసుకుని విచారించి వారి నుంచి వివరాలు రాబట్టి ఎవరు సూత్రధారులన్నది తేల్చే దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం సాగిస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా ఉండే ప్రొఫెషనల్ కిల్లర్స్ ఈ హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు ఆ దిశగా మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు. వివేకా హత్య వెనుక సుపారి భారీ మొత్తాల్లోనే అందించినట్లు సమాచారం. మొదట వివేకా చనిపోయిన వెంటనే గుండెపోటుతో చనిపోయారని సంఘటన స్థలంలో ఉన్న సాక్ష్యాధారాలను పూర్తిగా తొలగించే విధంగా కుటుంబ సభ్యుల సహకారంతోనే సాగిందని విమర్శలు వెల్లువెత్తాయి.