జుమోటో.. స్విగ్గీస్.. రెడ్బైట్స్.. ఫుడ్‌పాండా.. ఎల్ప్.. ఇవన్నీ ఖాళీ కడుపును నింపే ఆన్లైన్ ఈటింగ్ యాప్స్. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చాలు నిమిషాల్లో ఎంచుకున్న ఆహారం ఇంటి ముందు వాలిపోతుంది. మెట్రో నగరాల్లో లెక్కలేనన్ని ఆన్లైన్ ఈటింగ్ యాప్‌లు వాడుకలో ఉన్నాయి. విజయవాడ ప్రజానీకం మాత్రం జుమోటో, స్విగ్గీస్ను చాలా సింపుల్‌గా ఉపయోగించుకుం టోంది. ఆన్లైన్ ఈటింగ్ యాప్స్ ఆహారానికి సులువైన మార్గాలుగా మారిపోయాయి. ఇప్పుడు ఆ యాప్స్ పేర్లు విజయవాడ కాప్స్‌కు ఆయుధాలుగా తయారవుతున్నాయి. కేసుల్లో ఇరుక్కుని చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతున్న నిందితుల కోసం వాటిని ఉపయోగిస్తున్నారు. స్టేషన్‌కు రమ్మని పోలీసులు పదేపదే ఇళ్లకు వెళ్లినా ముఖం చాటేసుకుని తిరుగుతున్న నిందితులు ఆఫర్ వచ్చిందని ఫోన్‌కాల్ రాగానే అసలు గుట్టును ఖాకీలకు ఇచ్చేస్తున్నారు.
వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నవారికి పోలీసులు ఫోన్లు చేస్తున్నారు. ఫిర్యాదును వివరించి స్టేషన్‌కు పిలిపిస్తున్నారు. ఇలాంటి వాళ్లలో ఎక్కువమంది పరారవుతున్నారు. ఒక విధమైన భరోసా దక్కితే తప్ప పోలీసుల వద్దకు వెళ్లడం లేదు. రెండు, మూడుసార్లు పోలీసుల నుంచి ఫోన్లు వెళ్లే సరికే వాటిని స్విచ్ఛాఫ్ చేసి రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారు. మరికొందరు పోలీసుల నంబర్లను ఫీడ్ చేసుకుని సమాధానం ఇవ్వడం మానేస్తున్నారు. నిందితుల ఎత్తుగడలను పసిగట్టిన విజయవాడ పోలీసులు వారి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. నిందితులు ఉపయోగిస్తున్న ఫోన్ నంబర్లను ట్రాక్ చేస్తున్నారు. వాళ్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో పసిగడుతున్నారు. కొన్ని ప్రైవేటు నంబర్లతో నిందితులకు ఆన్లైన్ ఈటింగ్ ఆఫర్లు ఇస్తున్నారు.
‘మీకు జుమోటో నుంచి ఫుడ్ ఆర్డర్ వచ్చింది. ఎక్కడున్నారో చెప్తే పంపిస్తాం.’ అని డెలివరీ బాయ్స్‌లా మాట్లాడుతున్నారు. ఇటీవల కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసుల్లో బెజవాప్స్ ఈ సూత్రాన్ని అనుసరించారు. ముగ్గురి విషయంలో ఆ సూత్రం మంచి ఫలితాన్ని ఇచ్చింది. మాట్లాడింది నిజంగా డెలివరీ బాయ్స్ అనుకుని తలదాచుకున్న చిరునామాను చెప్పేశారు. అప్పటికే ఆ పరిసర ప్రాంతాల్లో కాపు కాసిన పోలీసులు వారిని ఎత్తుకొచ్చి స్టేషన్లలో కూర్చోబెట్టారు. ఇప్పటి వరకు విజయవాడ నగరవాసుల ఆకలిని తీర్చుతున్న ఈటింగ్ యాప్స్, ఇప్పుడు నిందితులను పట్టుకోవడానికి ఎర వేసే ఆయుధాలుగానూ ఉపయోగపడు తుండడం విశేషం.