మంత్రివర్గ సమావేశంపై మళ్లీ పునరాలోచన ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వివేది ద్వారా నివేదిక పంపినప్పటికీ, సోమవారం సాయంత్రానికి దీనికి అనుమతి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ అనుమతి వచ్చినా మే 14వ తేదీ అంటే మంగళవారం వెంటనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయటం సాధ్యంకాదనే భావనలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నట్లు తెలుస్తోంది, ఆ తర్వాత ఏదోక రోజు కేబినెట్ సమావేశం ఏర్పాట చేయటమా లేక ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వటమా అనే అంశంపై చర్చ సాగుతోంది. తాజాగా శనివారం ప్రారంభమైన ఈ పునరాలోచనపై ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.
ఒకవేళ సోమవారం మధ్యాహ్నం నాటికి కేబినెట్ భేటీకి అనుమతి వచ్చినా గంటల వ్యవధిలో మంత్రులకు సమాచారం చేరవేసి.. అధికారులను సిద్ధం చేసి సమావేశం నిర్వహించడం సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 10వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని తొలుత భావించినా, ఈ సమావేశం ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ సాయిప్రసాద్‌కి స్పష్టం చేశారు. పైగా ఎజెండా ఏమిటో కూడా తనకు పంపాలని, ఆ మేరకు నోట్‌ను సర్క్యులేట్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, ఫణి తుఫాన్ పీడిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, మంచినీటి ఎద్దడి వంటి అంశాలపై చర్చించేందుకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కార్యాలయం ప్రిన్సిపల్ సెక్రటరీ సాయిప్రసాద్ లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు.
ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశమై ఈ అంశాలకు ఆమోదం తెలిపింది. ఆయా శాఖల నుంచి కూడా సమగ్ర సమాచారాన్ని తెప్పించింది. ఈ నివేదికను ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుంచి శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పంపి.. అక్కడ్నుంచి ఢిల్లీకి పంపారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆరో విడత లోక్ సభ ఎన్నికలు ఆదివారం జరుగుతుండటంతో పూర్తి హడావుడిగా ఉంది. అందువల్ల సోమవారం సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటుకు అనుమతి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ సోమవారం సాయంత్రానికి అనుమతి వచ్చినప్పటికీ, అప్పటికప్పుడు మంత్రులందరికీ మరుసటిరోజు అంటే 14వ తేదీన కేబినెట్ సమావేశం ఉంటుందనే సమాచారం పంపడం, అధికారులకు కూడా వర్తమానం పంపించాల్సిన అవసరం ఉండటంతో అంతా హడావుడిగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరంలేదని భావిస్తున్నారు. అందువల్లే మరో తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించటమా లేక కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత సంబంధిత అధికారులను పిలిపించి తగిన ఆదేశాలు ఇవ్వటమా అనే అంశంపై కూడా సీఎంవో కార్యాలయం ఆలోచన చేస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబుతో మాట్లాడిననంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు నిర్ణయం వెల్లడించకూడదని సీఎంవో కార్యాలయం భావిస్తోంది.