తిరుపతి వాసుల కల నెరవేరనుంది.. తిరుమల యాత్రికులకు ట్రాఫిక్ కడగండ్ల నుంచి ఉపశమనం లభించనుంది.. ఇందుకు ఊతమిచ్చే ‘గరుడ వారధి’ స్మార్ట్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ఆధ్యాత్మిక నగరిలో చకచకా సాగుతున్నాయి. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు నేరుగా బస్టాండు, రైల్వేస్టేషన్ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలిపిరికి చేరుకునేలా ఈ వారధి ఉపయోగపడనుంది. తిరుమలకు రోజూ సగటున 70వేల మంది యాత్రికులు తరలివస్తున్నారు. వీరిలో 95%కి పైగా రైళ్లు, బస్సులలో తిరుపతికి చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్తున్నారు. ఈ సమయంలో తిరుపతిలో భారీగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. బస్టాండు కూడలి- అలిపిరి నడుమ 5కి.మీ. రోడ్డు అతి రద్దీగా తయారై తిరుపతి వాసులకు, యాత్రికులకు నిత్యం నరకం చూపిస్తోంది. దీన్ని అధిగమించేందుకు స్మార్ట్ సిటీ, తితిదే నిధులతో చేపట్టిన గరుడ వారధి నిర్మాణం జోరుగా సాగుతోంది.
స్మార్ట్ ఎలివేటెడ్ కారిడార్ మొత్తం పొడవు 6.1కి.మీ. తిరుచానూరు మ్యాంగోమార్కెట్ సమీపంలో మొదలయ్యే వంతెన.. లక్ష్మీపురం కూడలి, రామానుజ కూడలి, శ్రీనివాసం, లీలామహల్ సెంటర్ మీదుగా నందిసర్కిల్ వద్ద పూర్తవుతుంది. దీనికోసం రూ.684కోట్ల నిధులు అవసరమని అంచనా. దీనిలో 65% తితిదే, 35% స్మార్ట్ సిటీ నిధులు ఉపయోగిస్తారు. స్మార్ట్ సిటీ నిధులు వాడాలంటే, కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో 17.5% రాష్ట్ర ప్రభుత్వం, 17.5% స్మార్ట్ నిధులు వాడతారు.
గరుడ వారధిని మూడు దశలుగా నిర్మించనున్నారు. తొలిదశలో తిరుచానూరు మ్యాంగో మార్కెట్ నుంచి రామానుజ కూడలితో పాటు లీలామహల్ నుంచి నందిసర్కిల్ వరకు ఉంటుంది. రెండో దశలో శ్రీనివాసం నుంచి లీలామహల్ సర్కిల్ వరకు, మూడో దశ కీలకం కావడంతో రామానుజ సర్కిల్ నుంచి శ్రీనివాసం వరకు ఉంటుంది. బస్టాండు ప్రాంతంలో అండర్‌పాస్‌లు, రైల్వేస్టేషన్ నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక లైన్లతో పాటు లీలామహల్ సర్కిల్ వద్ద కడప నుంచి వచ్చే వాహనాల కోసం డబుల్ లైను రాబోతోంది. మొత్తం 4 లైన్ల వారధి, రెండేళ్లలో పూర్తిచేయాలనేది లక్ష్యం. గుత్తేదారు ఐదేళ్లపాటు నిర్వహించి, తితిదేకు అప్పగిస్తారు. వారధిని ఆధ్యాత్మిక కళ ఉట్టిపడేలా నిర్మిస్తారు. దానికి తిరునామాలు, స్వామివారి చిత్రాలతో పాటు.. కిందిభాగంలో శంకు, చక్రాల చిత్రాలు రకరకాల శ్రీవారి నమూనాలతో రూపమిస్తారు. పచ్చదనంతో కూడిన విశాలమైన లాన్లు వచ్చేలా చూస్తారు. ప్రాజెక్టుకు సమాంతరంగా తిరుపతిలోని 27కి.మీ. ప్రాంతాన్ని స్మార్ట్ వీధులుగా తీర్చిదిద్దే ప్రక్రియను అనుబంధంగా చేపడతారు.