టీవీ-9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అజ్ఞాతాన్ని వీడి.. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. రెండో రోజు కూడా రవిప్రకాష్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పగా.. మరికొన్నింటికి నోరు మెదపలేదని సమాచారం. ఇదిలా ఉంటే.. విచారణ అనంతరం బయటికొచ్చిన రవిప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మీడియాను కబ్జా చేసేందుకు మాఫియా ప్రయత్నిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అమ్రిష్‌పురిలాంటి ఒక విలన్ అన్ని టీవీలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఉన్నట్టుండి రవిప్రకాష్ బాంబు పేల్చారు. అయితే మీడియాను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నదెవరు..? ఇంతకీ ఆ అమ్రిష్‌పురిలాంటి తెలంగాణలో ఎవరు..? అనే విషయాలపై మాత్రం రవిప్రకాష్ క్లారిటీ చెప్పేందుకు సాహసించలేదు.
జర్నలిస్టులంతా పోరాడాలి! "మీడియా, మాఫియా మధ్య యుద్ధం జరుగుతోంది. మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలి. దొంగ పత్రాలతో భూములు లాక్కొన్నట్లు మీడియాను ఆక్రమిస్తున్నారు. పోలీసుల సహకారంతో ‘మోజో’ టీవీ యాజమాన్యాన్ని బెదిరించి లాక్కున్నారు. మీడియా కబ్జాపై జర్నలిస్ట్‌లంతా పోరాడాలి" అని రవిప్రకాష్ పిలుపునిచ్చారు. అయితే ఈ వ్యవహారంపై అటు టీవీ9 యాజమాన్యం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.