విజయవాడ ఎంపీ కేశినేని నాని పై రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన బీజేపీలో చేరిపోతారంటూ వార్తలు కూడా వచ్చాయి. మరో పక్క ఆయన నాకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు అంటూ, అసంత్రుప్తిలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. నిన్న తెదేపా అధినేత చంద్రబాబు వద్ద జరిగిన సమావేశానికి హాజరైన ఆయనకు లోక్‌సభలో పార్టీ ఉపనేతగా, విప్ పదవి కట్టబెట్టారు. అంతకు ముందు జరిగిన పార్లమెంటరీ సమావేశంలో గల్లా జయదేవ్‌ను పార్లమెంటరీ పార్టీ నేతగా, రామ్మోహన్‌నాయుడును లోక్‌సభాపక్ష నేతగా చంద్రబాబు నియమించారు. దీనిపై ఎంపీ కేశినేని నాని మనస్తాపానికి గురయ్యారు. తనకు పార్టీలో ప్రాధాన్యం కల్పించటం లేదని అసంతృప్తితో విజయవాడలో చంద్రబాబు నిర్వహించిన ఇఫ్తార్ విందుకు కేశినేని హాజరుకాలేదు. నిన్నటి సమావేశంలో పార్టీ కట్టబెట్టిన పదవులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌లో స్పందించారు.
‘‘లోక్‌సభలో పార్టీ విప్ పదవి ఇచ్చినందుకు అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు. నా కంటే సమర్థుడైన వేరొకరిని ఆ పదవిలో నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అంత పెద్ద పదవి చేపట్టడానికి నేను అనర్హుడినని భావిస్తున్నా. విజయవాడ ప్రజలు నన్ను ఎంపీగా ఎన్నుకున్నారు. వారి ఆశీస్సులు నాకున్నాయి. పార్టీ ఇచ్చే విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతృప్తి ఇస్తుంది’’ అని పేర్కొన్నారు. మరోసారి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ పదవి తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు చెప్పారు.
టీడీపీ ఎంపీ కేశినేని నాని బీజేపీలో చేరనున్నట్లు గత కొద్ది రోజులుగా వైసీపీ వర్గాలు సోషల్ మీడియాలో ప్రచారం చేశాయి. నితిన్ గడ్కరీని అందుకే కలిశారని, చేరిక ఖాయమని ఓ వార్త హల్‌చల్ చేసింది. తాజాగా చంద్రబాబు నియమించిన విప్ పదవిని తిరస్కరించడానికి కారణం కూడా ఇదేనంటూ వైసీపీ అప్పుడే ప్రచారం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కేశినేని నాని స్పందించారు. బీజేపీలో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. తనకు ఆ అవసరం లేదని చెప్పారు. ఇక విప్ బాధ్యతలు అప్పగించడంపై స్పందిస్తూ.. పెద్ద పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. కానీ ఆ పదవిని తాను స్వీకరించలేనని, తాను అంత సమర్థుడిని కాదని కేశినేని నాని చెప్పుకొచ్చారు.