వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కృష్ణ కరకట్ట పక్కనే చంద్రబాబు నివాసం ఉన్న సంగతి తెలిసిందే. అయితే తన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని ప్రతిపక్ష నేత నివాసానికి అనుబంధంగా గుర్తించాలని వినతి చేశారు. పార్టీ అధినేతగా తనను కలిసేందుకు అనేకమంది వస్తుంటారని అందువల్ల ఈ భవనాన్ని తమకే కేటాయించాలని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం ఉదయం పార్టీ నేతలతో చంద్రబాబు అంతర్గత సమావేశం జరిపారు. టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు పలు కీలక విషయాలపై నిశితంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రజావేదిక భవనం గురించి చర్చించి వైఎస్ జగన్‌కు లేఖ రాయడం జరిగింది. అయితే ఈ లేఖపై సీఎం జగన్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
ఉండవల్లిలో చంద్రబాబు నివాసాన్ని ఆనుకుని ఉన్న ప్రజా వేదిక భవనాన్ని ఆయన నివాస భవనంగా వినియోగించుకోవడానికి అనుమతించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని టీడీపీ సమావేశం నిర్ణయించింది. చంద్రబాబు ప్రస్తుతం ఒక ప్రైవేటు భవనంలో ఉంటున్నారు. ఆయన దానికి ప్రతి నెలా అద్దె చెలిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఆయనకు నివాస భవనాన్ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ప్రజా వేదిక భవనాన్ని ఇస్తే సౌకర్యంగా ఉంటుందని, దీనిని ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ పంపాలని నిర్ణయించారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమ నిర్మించిన పార్టీ కార్యాలయం విశాలంగా ఉన్నందున.. పార్టీ రాష్ట్ర కార్యాలయం పూర్తయ్యేవరకూ దానిని వినియోగించుకోవడంపై ఆలోచన చేయాలని నిశ్చయించారు.