వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ఫలితాలు తరువాత తొలిసారి విశాఖ పర్యటనకు వెళ్లారు. విశాఖలోని శారదా పీఠాన్ని దర్శించుకున్నారు. శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతికి సీఎం జగన్ పట్టువస్త్రాలు, ఫలాలు సమర్పించారు. సీఎం హోదాలో తనను కలిసేందుకు వచ్చిన జగన్‌ను స్వరూపానంద స్వామి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ముద్దాడారు. విశాఖ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారికి జగన్‌తో ప్రత్యేక పూజలు చేయించారు. సీఎం జగన్‌తో స్వరూపానంద ఏకాంతంగా చర్చలు జరిపారు.విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో శారదా పీఠానికి చేరుకున్న జగన్‌కు పీఠం వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి పీఠానికి చేరుకున్న జగన్ ..స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం పీఠం అధిదేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
2017లో పాదయాత్ర ప్రారంభానికి ముందు కూడా జగన్ ఈ ఆశ్రమానికి వెళ్లి స్వామి ఆశీస్సులు పొందారు. ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడు మళ్లీ ఆశీస్సులు పొందారు. ఈ నెల 8న మంత్రివర్గాన్ని విస్తరించనున్న నేపథ్యంలో మంత్రుల పేర్ల విషయమై స్వరూపానందేంద్రతో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఉత్తరాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైకాపా నేతలు జగన్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి జగన్ ప్రత్యేక కాన్వాయ్‌లో శారదా పీఠానికి చేరుకున్నారు. శారదాపీఠంలో వేదపండితులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.